ముఖం చాటేసిన వాన

ABN , First Publish Date - 2021-06-23T05:43:45+05:30 IST

వరుణదేవుడు ముఖం చాటేశాడు. ఖరీఫ్‌ ఆరంభంలో భారీ వర్షాలతో స్వాగతం పలికాడు. వరుణదేవుడి కటాక్షంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

ముఖం చాటేసిన వాన

ఖరీఫ్‌ ప్రారంభంలో భారీ వర్షం

ఆ తరువాత జాడే లేని చినుకు

దుక్కులు దున్నని రైతులు

వర్షం కోసం ఎదురు చూపు


కడప, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): వరుణదేవుడు ముఖం చాటేశాడు. ఖరీఫ్‌ ఆరంభంలో భారీ వర్షాలతో స్వాగతం పలికాడు. వరుణదేవుడి కటాక్షంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురుస్తుండడంతో ఈసారి ఇక పంటల సాగుకు డోకా ఉండదని భావించారు. వాతావరణ శాఖ చెప్పినట్లు ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని సంబరపడ్డారు. 34 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది. అయితే తరువాత వరుణుడు ముఖం చాటేశాడు. జూన్‌ నెల దాటిపోతున్నా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. గత మూడు రోజులుగా వేసవిని తలపించేలా సూర్యుడు భగ్గుమంటున్నాడు. పొలం దుక్కు దున్నుతామనుకుంటున్న రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. 

జిల్లాలో జూన్‌ మొదటి వారంలో భారీ వర్షాలు కురిశాయి. జూన్‌ మాసంలో సాధారణ వర్షపాతం 69.2 మి.మీ నమోదు కావాల్సి ఉంది. అయితే తొలినాళ్లలో భారీ వర్షాలు కురవడంతో 103.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటికే 49 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంకా నెల ముగింపుకు వారం రోజులు ఉంది. అయితే జిల్లా అంతటా వర్షాలు కురిసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. 34 మండలాల్లో సమృద్ధిగా వర్షపాతం నమోదైంది. కలసపాడులో జూన్‌లో 93.9 మి.మీ. పడాల్సి ఉండగా 27.8, చిట్వేలిలో 70 నమోదైంది. ఇక్కడ అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. రాజంపేట, గోపవరం, పుల్లంపేట, పెనగలూరు, కోడూరు, పోరుమామిళ్ల, ఓబులవారిపల్లెలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. టి.సుండుపల్లె, నందలూరు, మైలవరం, బి.మఠం, పెద్దముడియం, బద్వేలు, బి.కోడూరు, సింహాద్రిపురం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో ఇంకా వ్యవసాయ పనులు మొదలు కాలేదు. సుమారు 16 రోజుల పాటు జల్లులు తప్ప పదునైన వర్షం పడలేదు. దీని ప్రభావం పంటల సాగుపై పడింది. వరుణదేవుడి కరుణ కోసం రైతన్నలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  

Updated Date - 2021-06-23T05:43:45+05:30 IST