రైతులను ముంచిన వాన

ABN , First Publish Date - 2022-01-13T05:14:19+05:30 IST

రైతులను ముంచిన వాన

రైతులను ముంచిన వాన
అర్పనపల్లిలో తడిసిన మిర్చిని ఎత్తుకుంటున్న రైతులు, గూడూరులో కురిసిన వడగండ్లు వాన, బ్రహ్మణపల్లిలో నేలవాలి విరిగిపోయిన తేజావత్‌ రాంసింగ్‌ మొక్కజొన్న తోట

జిల్లాలో గాలివాన బీభత్సం

గూడూరులో కుండపోత వర్షం, వడగండ్ల  వాన

తూర్చుకుపెట్టుకుపోయిన మొక్కజొన్న, మిర్చి తోటలు

జిల్లాలో 317 ఎకరాల్లో మొక్కజొన్న, 820 ఎకరాల్లో మిర్చితోటలకు నష్టం


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జనవరి 12 : జిల్లాలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, గాలివాన, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురియగా గూడూరులో కుండపోతగా వర్షం కురియడంతో భారీ నష్టం వాటిల్లింది. గూడూరు మండలంలో గాలివాన బీభత్సానికి, గాలివానకు మొక్కజొన్న తోటలు విరిగిపోయి నేలకు ఒరిగిపోగా, మిర్చిపంట గాలికి కొట్టుకుపోయింది. ఆకులు సైతం ఎగిరిపోయాయి. వడగండ్లు పెద్దసంఖ్యలో పడడంతో మిర్చికి భారీ సంఖ్యలో నష్టం వాటిల్లింది. గాలివాన బీభత్సానికి వందల ఎకరాల్లో పంట నష్టపోయింది. గూడూరు, కొత్తగూడ మండలాల్లో 317 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రాథమి క అంచనా వేశారు. జిల్లాలో 820 ఎకరాల్లో మిర్చి తో టలకు నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రాథమిక అంచనా వేశారు.  


జిల్లాలో ఇలా....

గూడూరు మండలంలో 39 గ్రామపంచాయతీల పరిధిలో గాలివాన బీభత్సం సృష్టించింది. నెక్కొండ-గూడూరు ప్రధాన రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడూరు సమీపంలో వడ్డెరగూడెంలో రైతు వేదిక పైకప్పు ఎగిరిపోగా, ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ చేసే రేకులషెడ్డు కూడ గాలిదుమారానికి కొట్టుకుపోయాయి. అనేక గ్రామాల్లో కరెంట్‌ స్తంభాలు విరిగిపోయి నేలకొరిగాయి. గ్రామాల్లో కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన గాలులు వీయడంతో పాటు కుండపోత వర్షం కురియడంతో గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో మొక్కజొన్న తోటలు విరిగిపోయి నేలకు ఒరిగిపోయాయి. మిర్చి తోటల్లో కాయ లతో పాటు చెట్లకు ఉన్న ఆకులు సైతం కొట్టుకుపోయాయి. గూడూరు, మర్రిమిట్ట, బ్రహ్మణపల్లి గ్రామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. మిగతా గ్రామాల్లో మిర్చి పంట తూర్చిపెట్టుకుపోయిందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో పాటు పత్తి కాయల్లో దూది రాలిపోయి నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన భారీ వర్షం బుధవారం సాయంత్రం వరకు మండలంలో కుండపోతగానే కురిసింది.


 కొత్తగూడ మండలంలో గుండంపల్లి, గుడితండ, తిమ్మాపూర్‌ ప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మండలంలో భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్‌లు కప్పుకున్నారు. గంగారం మండలంలో కూడా కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు కంకులు తెంపుకుని ఆరబెట్టుకున్న సమయంలో వర్షం కురియడంతో కంకులు తడిసిపోయాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కేసముద్రం మండలంలో భారీ వర్షం కురిసింది. అర్పనపల్లి గ్రామంలో మిర్చి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ గ్రామంలోని జాటోతు బిచ్యాకు 10 క్వింటాళ్లు, బిక్కుకు 5 క్వింటాళ్లు, బానోత్‌ లింగ్యాకు 8 క్వింటాళ్లు, బానోత్‌ లక్కుకు 5 క్వింటాళ్ల వరకు మిర్చి తడిసి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న రైతు కోఆర్డినేటర్‌ గంధసిరి సోమయ్య, మాజీ సర్పంచ్‌ హుమ్య, వార్డు సభ్యులు బాలునాయక్‌లు నష్టపోయిన పంటలను పరిశీలించారు. 


డోర్నకల్‌, గార్ల మండలాల్లో కురిసిన వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు కప్పుకున్నప్పటికి అక్కడక్కడ కొంతమేర ధాన్యం తడిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో రైతులు ముందుగానే జాగ్రత్త పడడంతో  నష్టం జరుగలేదు. తొర్రూరు పట్టణంలో ఉదయం, మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మండలంలో మాత్రం అక్కడక్కడ మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి, కురవి, బయ్యారం, మహబూబాబాద్‌ మండలాల్లో చిన్నపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. భారీ వర్షం కురియడంతో వర్షం నీటిలో మిర్చి తోటలు మునిగిపోయి ఉన్నాయి. చిన్నగూడూరు, మరిపెడ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మిగతా గ్రామాల్లో వర్షంకురియలేదు. సాయంత్రం ఆకాశంలో దట్టమైన మబ్బులు అలుముకోవడంతో రాత్రి భారీ వర్షం కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. 


గూడూరు, కొత్తగూడ మండలాల్లో పంట నష్టం..

గూడూరు మండలంలో 200 ఎకరాల్లో మొక్కజొన్న, కొత్తగూడ మండలంలో 117 ఎకరాల్లో మొక్కజొన్న నేలవారి మొక్కలు విరిగిపోయాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వర్షం తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో సర్వే చేసి పూర్తి స్థాయిలో పంటనష్టంపై అంచనా వేస్తామని చెప్పారు. గూడూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి 500 ఎకరాల్లో మిర్చి, కేసముద్రం మండలంలో కేసముద్రం, ధన్నసరి కేసముద్రం విలేజ్‌, కల్వల, తాళ్లపూసపల్లి గ్రామాల్లో 200 ఎకరాలు, కొత్తగూడలో 100, గంగారంలో 20 ఎకరాల్లో మిర్చి తోటలకు నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 


వర్షపాతం ఇలా...

జిల్లాలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 140.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గూడూరులో 74.2, కొత్తగూడలో 59.4, కురవిలో 0.8, కేసముద్రంలో 1.2, నెల్లికుదురులో 1.2, నర్సింహులపేటలో 2.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, గూడూరులో కుండపోత వర్షం కురిసి మిర్చి పంటలు నష్టపోయినా అధికారులు మాత్రం పంట నష్టం జరుగలేదని చెబుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 









Updated Date - 2022-01-13T05:14:19+05:30 IST