వాన నీటిలో కొట్టుకుపోయి చెరువులోకి...

ABN , First Publish Date - 2020-09-21T07:36:00+05:30 IST

శనివారం కురిసిన కుండపోతకు అతలాకుతలమైన హైదరాబాద్‌ ఈస్ట్‌, ఆదివారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికింది. నగరానికి ఈస్ట్‌

వాన నీటిలో కొట్టుకుపోయి చెరువులోకి...

దిల్‌సుఖ్‌నగర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి) :

సరూర్‌నగర్‌ చెరువు కట్ట నుంచి తపోవన్‌ కాలనీ వైపు వెళ్లే దారిలో జరిగిన ఈ దుర్ఘటనతో అక్కడే ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. స్థానికులు కాపాడేలోపు చెరువు లోపలికి కొట్టుకుపోయాడు. 


వరుస వర్షాలతో జనం గజగజ  

హైదరాబాద్‌ సిటీ :  శనివారం కురిసిన కుండపోతకు అతలాకుతలమైన హైదరాబాద్‌ ఈస్ట్‌, ఆదివారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికింది. నగరానికి ఈస్ట్‌ వైపున ఉన్న కాలనీలు, వీధులన్నీ పూర్తిగా జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద కాలువలుగా మారాయి. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. వాన నీటిలో వాహనం మొరాయించి ఇబ్బందులు పడుతున్న వాహనదా రుడికి సహాయం చేయడానికి వెళ్లి నవీన్‌ కుమార్‌ ప్రమాదానికి గురయ్యాడు..


ఆదివారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురవగా, హైదరాబాద్‌ ఈస్ట్‌ వైపున ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, చంపాపేట, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల పాటు దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో కాలనీల ప్రజలు భయందోళన చెందారు. లోతట్టు ప్రాం తాలు నీట మునిగాయి. జైపురి కాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలు రహదారులు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. 


ఇళ్లలోకి చేరిన వరద 

ఆదివారం నాగోల్‌ బండ్లగూడలో అత్యధికంగా 8.05 సెంటిమీటర్ల వర్షం కురిసింది. హయత్‌నగర్‌లోని భవానీనగర్‌లో 7.95, నాగోల్‌లో 7.68, లింగోజిగూడలో 7.15, హస్తినాపురంలో 6.70 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా అంబర్‌పేట, రామంతాపూర్‌, సులేమాన్‌నగర్‌లో 1.13 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం కావడంతో వాహనదారులెవ్వరూ రోడ్డు మీదకు రాకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు అంతలా లేవు. నాగోల్‌, బండ్లగూడ, హయత్‌నగర్‌, హస్తినాపురం తదితర కాలనీల్లో వర్షం తగ్గుముఖం పట్టినా మూడు గంటల పాటు వరద నీటి ప్రవాహం కొనసాగింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లి నుంచి అరాంఘర్‌ వెళ్ళే మార్గంలో రాందేవ్‌ బాబా దేవాలయం వద్ద రోడ్డుపై వర్షం నీరు చేరింది. వాహనాలు నిలిచిపోయాయి. 


ఆ మూడు కారణాలతోనే... 

సాధారణంగా ఈ సమయంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుంటాయి. అయితే రుతుపవనాలకు అల్పపీడనం, ఉపరితల ఆవర్తన, ద్రోణులు తోడయ్యాయి. వేసవిలో ప్రభావం చూపే క్యూములోనింబస్‌ మేఘాలు సైతం ప్రస్తుతం కలిశాయి. మూడు రకాల  ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ, తూర్పు వైపున ఏర్పడిన ఉపరితల ఆవర్తనలో షీర్‌ జోన్‌ ఏర్పడడంతో రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ నెల చివరి వరకు, అక్టోబర్‌ మొదటి వారం వరకు వర్షాలుంటాయి. ఏ స్థాయిలో అనేది అంచనా వేయలేమని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


సమయం : ఆదివారం రాత్రి 8 గంటలు

పరిస్థితి : అప్పటికే కురిసిన వర్షానికి రోడ్లపైకి వరద

వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి : నవీన్‌కుమార్‌

వయసు : 45 సంవత్సరాలు

వృత్తి : ఎలక్ట్రీషియన్‌, అల్మాస్‌గూడ

ఎలా జరిగింది : రోడ్లపై వరదనీటి ధాటికి.. సరూర్‌నగర్‌ చెరువులోకి కొట్టుకుపోయాడు.


ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం  : 

నవీన్‌కుమార్‌ వరద నీటి ప్రవాహానికి రోడ్డుపైనే కొంత దూరం కొట్టుకుంటూ పోయాడు. 

అలా చెరువునీటిలోకి వెళ్లిపోయాడు

తాను చెరువువైపు వెళ్తున్నట్లు ఆయన గ్రహించ లేదు.

ఆదివారం రాత్రి 1.30 గంటలకు : నవీన్‌కుమార్‌ జాడ తెలియలేదు.


ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదయిన ప్రాంతాలు (సెంటీమీటర్లలో) 

బండ్లగూడలో 8.05

హయత్‌నగర్‌లోని భవనీనగర్‌లో 7.95

నాగోల్‌లో 7.68

లింగోజిగూడలో 7.15

హస్తినాపురంలో 6.70

వనస్థలిపురంలో 5.65

రాజేంద్రనగర్‌లో 4.83

విరాట్‌నగర్‌లో 4.68

ఎల్‌బీనగర్‌లో 4.55

Updated Date - 2020-09-21T07:36:00+05:30 IST