చినుకు రాలదు...అదును దొరకదు!

ABN , First Publish Date - 2021-06-21T04:07:41+05:30 IST

జిల్లాలో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు. దీంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. ఖరీఫ్‌ సన్నాహాలు ప్రారంభించినా వర్షపు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

చినుకు రాలదు...అదును దొరకదు!


జిల్లాలో వర్షపాతం లోటు

ఈ నెలలో కనీస స్థాయిలో కురవని వైనం

ఖరీఫ్‌ పనులు ఆలస్యం

ఆందోళనలో రైతాంగం

(కలెక్టరేట్‌)

ఖరీఫ్‌ ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్‌ నెలలో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదును దొరకకపోవడం, చెరువులు, నదులు, కాలువల్లో నీరు లేకపోవడంతో విత్తనాలు వేసుకునేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు పెరిగిన డీజిల్‌ ధరలతో సాగుభారం అ‘ధన’మైంది. గత ఏడాది కంటే దుక్కులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. యంత్రాల అద్దెలు, కూలీల ధరలు పెనుభారంగా పరిణమించాయి. కౌలురైతులదీ అదే పరిస్థితి. ప్రస్తుతం సాగుహక్కు పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభమైనా.. ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. కొర్రీలు పెడుతుండడంతో కౌలురైతులకు ‘భరోసా’ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. 

- జిల్లాలో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు. దీంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. ఖరీఫ్‌ సన్నాహాలు ప్రారంభించినా వర్షపు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరి నారుమడులు, ఎదలు వేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు పడకపోవడంతో అదును దొరకలేదు. మరోవైపు చెరువులు, కాలువల్లో కూడా చుక్క నీరు లేదు. ఏటా జూన్‌లో చెదురుమదురు వర్షాలతో చెరువులు, కాలువల్లో నీరు చేరుతుంది. రైతులు కొంతవరకూ ధైర్యంతో ముందస్తుగా పనులు ప్రారంభించేవారు. అయితే కొన్నేళ్లుగా ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉంది. దీంతో రైతులు పనులు ప్రారంభించాలా? లేదా? అన్న డైలమాలో ఉన్నారు. ఈనెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 90.8 మిల్లీ మీటర్లు వర్షం కురవాల్సి ఉండగా.. 62.2 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. 31.5 మిల్లీ మీటర్ల లోటు కనిపిస్తోంది. కురుపాం, జియ్యమ్మవలస, మెరకముడిదాం, బొండపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గుమ్మలక్ష్మీపురం, మక్కువ,తెర్లాం, దత్తిరాజేరు, గజపతినగరం, పూసపాటిరేగ, విజయనగరం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో మాత్రం కనీస స్థాయిలో కూడా నమోదు కాలేదు. ఈ పరిస్థితిల్లో నదులు, కాలువల పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే రైతులు ఖరీఫ్‌ పనులు ప్రారంభించేందుకు ధైర్యం చేస్తున్నారు. 


11111111111111111111111111111111111

Updated Date - 2021-06-21T04:07:41+05:30 IST