చినుకు పడినా చల్లబడలేదు..

ABN , First Publish Date - 2020-06-04T11:14:32+05:30 IST

రోహిణీ కార్తె మధ్యలోనే వర్షాలు కురవడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.

చినుకు పడినా చల్లబడలేదు..

జిల్లాలో విభిన్న వాతావరణం

ఉదయం వాన.. మధ్యాహ్నం ఎండ

-విద్యుత్‌ కోతలు - ఉక్కరిబిక్కిరైన ప్రజానీకం


పాలకొల్లు అర్బన్‌/ యలమంచిలి/ నరసాపురం/ భీమవరం రూరల్‌/ వీరవాసరం/ మొగల్తూరు, జూన్‌3 :రోహిణీ కార్తె మధ్యలోనే వర్షాలు కురవడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.తీర ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల పాటు ఉరుములు,  మెరుపులతో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి.రహదారులపై నీరు ప్రవహించింది.ఇటు పిడుగులకు టీవీలు, ఫ్యాన్‌లు, ఏసీలు, ఇన్వర్టర్లు కాలిపోయాయి. ఎక్కువగా స్టీమర్‌ రోడ్‌లో  ఆస్తి నష్టం జరిగింది. సబ్‌జైల్‌ మైదానంలో పిడుగుపాటుకు ఆ ప్రాంతంలోని నివాసాల్లో ఎలక్ర్టికల్‌ సామాన్లు నాశనమయ్యాయి.పలు చోట్ల విద్యుత్‌ లైన్ల కండె న్సర్లు,కేబుల్‌ బాక్స్‌లు కాలిపోయాయి.  మొగల్తూరులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వర్షం కురిసింది.. ఆ తరువాత భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు.


జిల్లా వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు పొంగి పొర్లాయి.మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆకాశం మేఘావృతమైంది.దీంతో గత నెల రోజులుగా ఉక్కబోతతో బాధపడుతున్న ప్రజలు సేదతీరారు. అనంతరం ఎండ తీవ్రం కావడంతో ఉక్కబోతతో ప్రజలు అపసోపాలు పడ్డారు.చినుకు పడినా బుధవారం రాత్రి గాలి లేక ప్రజలు ఉక్కబోతతో అల్లాడారు. తరచుగా విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


మామిడికి నష్టం.. ఆక్వాకు కష్టం..

 వర్షం కొంత మంది రైతాంగానికి ఆనందాన్ని తెచ్చిపెడితే.. మరికొంత మంది రైతాంగానికి ఆందోళన తెచ్చిపెట్టింది. దాళ్వా మాసూళ్లు పూర్తయిన తరువాత వాతావరణం అనుకూలించడంతో రైతులు వ్యవసాయేతర పనులు చేసుకుంటు న్నారు. పది రోజులుగా పంట భూమిలో మట్టి ఎత్తుపల్లాల పూడిక పనులు, గడ్డి చల్లడం వంటి పనులు చేస్తున్నారు.వాతావరణం చల్లబడడం రైతులలో కొంత ఆనందం కనిపిస్తుంది.అయితే ఆక్వా, మామిడి రైతుల్లో మాత్రం ఆందోళన కనిపించింది.వర్షం, ఉక్కబోతలతో  ఆక్సిజన్‌ అందక చెరువుల్లోని రొయ్యలు తేలిపోతున్నాయి. మామిడి రైతులకు ఈ వర్షం నష్టం చేకూర్చింది.

Updated Date - 2020-06-04T11:14:32+05:30 IST