Jun 3 2021 @ 17:53PM

భారీ వర్షంతో దెబ్బతిన్న.. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ సెట్‌

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్.. తెలుగులో భారీ విజయం సాధించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లుగా నిర్మాత డా. జయంతిలాల్ గడ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం ఆగిపోయిందనే విధంగా కూడా ఆ తర్వాత వార్తలు రావడం, వాటిని చిత్రయూనిట్ ఖండించడం వంటివి జరిగాయి. అనంతరం హైదరాబాద్‌లోనే ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే ఇప్పుడా సెట్.. సడెన్‌గా కురిసిన భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకున్న ఈ చిత్ర షూటింగ్‌ను ఏప్రిల్‌ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ‘రంగస్థలం’ విలేజ్‌ సెట్‌ను కూడా అప్పట్లో అదే లొకేషన్‌లో క్రియేట్‌ చేశారు. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు మేకర్స్. ఈ లోపు 3కోట్ల రూపాయలతో వేసిన సెట్‌ తాజాగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో ఉన్నారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు అండ్‌ కో. ఈ సెట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని మేక‌ర్స్ తెలియజేశారు‌. తెలుగు ‘ఛత్రపతి’ చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక–రచయిత విజయేంద్రప్రసాద్.. ఈ హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌కు స్క్రిప్ట్‌ అందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్న ఈ చిత్రానికి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది.