పంట పొలాలకు వర్షం దెబ్బ

ABN , First Publish Date - 2021-09-29T06:21:47+05:30 IST

గులాబ్‌ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

పంట పొలాలకు వర్షం దెబ్బ
వెల్లంకిలో నీటమునిగిన పొలాలు

21,731 ఎకరాలకుపైగా పంటలు నీటమునక

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : గులాబ్‌ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 21వేల ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 49.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు జిల్లాలోని 227 గ్రామాల్లో వివిధ పంటలు నీటమునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 5,050 ఎకరాల్లో వరి, 4,520 ఎకరాల్లో మినుము, 200 ఎకరాల్లో మిర్చి, 11,312 ఎకరాల్లో పత్తి, 249 ఎకరాల్లో పెసర, 300 ఎకరాల్లో వేరుశనగ, వంద ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. 


వర్షపాతం వివరాలివి..

గంపలగూడెంలో అత్యధికంగా 223 మిల్లీమీటర్లు, విస్సన్నపేటలో 211, ఎ.కొండూరులో 181, రెడ్డిగూడెంలో 128.8, వత్సవాయిలో 121.8, గన్నవరంలో 119, చాట్రాయిలో 96.2, ఉంగుటూరులో 83.2, పెనుగంచిప్రోలులో 60.6, తిరువూరులో 59.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగాయలంకలో అత్యల్పంగా 3.4మిల్లీమీటర్లు నమోదైంది. 

Updated Date - 2021-09-29T06:21:47+05:30 IST