ముంచెత్తిన వర్షాలు!

ABN , First Publish Date - 2022-01-17T08:15:15+05:30 IST

రాష్ట్రంలో పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. హైదరాబాద్‌లో రోడ్లపై

ముంచెత్తిన వర్షాలు!

హైదరాబాద్‌ రోడ్లపై పోటెత్తిన వరద

అత్యధికంగా కాప్రాలో 11.6 సెంటీమీటర్లు నమోదు

తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి


(‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. హైదరాబాద్‌లో రోడ్లపై వరదనీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ పరిధిలోని కాప్రాలో అత్యధికంగా 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాన్నీ అకాలవర్షం ముంచెత్తింది. అన్నదాతలకు ఊహించని నష్టాన్ని మిగిల్చింది. పలు చోట్ల వరిపొలాలు నీట మునగగా.. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. కూసుమంచి మండలంలో 23వేల ఎకరాలకు ఇప్పటికే 12 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా.. ఇప్పుడు అవన్నీ నీటమునిగాయి. అలాగే మండలంలో 5,700 ఎకరాల్లో మిర్చి సాగైతే.. ఈ సారి తెగుళ్లతో నష్టపోయిన రైతులను ఆకస్మిక వర్షం దెబ్బ కొట్టింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. దీంతో ఆ పంట తాలుగా, రంగు మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పెరిగింది. దీంతో అధికారులు ఆదివారం మూడు క్రస్టుగేట్లను 3 అడుగుల మేర ఎత్తారు. 6 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా అతలాకుతలమైంది. నూతన్‌కల్‌ మండలంలో 68.1 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 57.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేటలోని పలు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి.


ఆత్మకూర్‌(ఎస్‌), అర్వపల్లి, నాగారం, మద్దిరాల, నూతన్‌కల్‌ మండలాల్లో చెరువులు, కుంటలు అలుగు పోయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సూర్యాపేటలోని సద్దుల చెరువు అలుగుబోసింది. పలు ప్రాంతాలు నీట మునడంతో.. మంచినీటి సౌకర్యం లేక జనం అల్లాడిపోయారు. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంక్రాంతి(శనివారం) రోజున ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతల కంటే ఆదివారం 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో శనివారం 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదివారం 14.8 డిగ్రీలు నమోదైంది. అదే క్రమంలో నిజామాబాద్‌లో 17.2 డిగ్రీలు, మెదక్‌లో 17.6 డిగ్రీలు, హనుమకొండలో 18 డిగ్రీలు, హైదరాబాద్‌లో 18.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.  

Updated Date - 2022-01-17T08:15:15+05:30 IST