వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2022-06-20T04:49:23+05:30 IST

తొలకరి వర్షాలకు ఎన్నో ఆశలతో విత్తనాలు వేసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. విత్తనాలు మొలకెత్తే దశలో శనివారం రాత్రి అచ్చంపేట, ఉప్పునుంత మండలాల పరిఽధిలోని సింగారం, బ్రాహ్మణపల్లి, కొర్ర తండా, కన్నె తండా, బొమ్మన్‌పల్లి, పెనిమిళ్ల, గువ్వలోనిపల్లి, లత్తిపూర్‌ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.

వర్ష బీభత్సం
పెనిమిళ్లలో పేరుకుపోయిన ఇసుక మేటలు

ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల్లో భారీ వర్షం

నీట మునిగిన పత్తి మొలకలు .. పొలాల్లో ఇసుక మేటలు 

నిండా మునిగిన రైతులు 


అచ్చంపేట, జూన్‌ 19: తొలకరి వర్షాలకు ఎన్నో ఆశలతో విత్తనాలు వేసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. విత్తనాలు మొలకెత్తే దశలో శనివారం రాత్రి అచ్చంపేట, ఉప్పునుంత మండలాల పరిఽధిలోని సింగారం, బ్రాహ్మణపల్లి, కొర్ర తండా, కన్నె తండా, బొమ్మన్‌పల్లి, పెనిమిళ్ల, గువ్వలోనిపల్లి, లత్తిపూర్‌ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పంటలు కోతకు గురై, ఇసుక మేటలు పెట్టాయి. మళ్లీ సాగు చేసుకోడానికి వీలులేకుండా మారాయి. దాదాపు గంటకుపైగా వర్షం కురవడంతో కుంటలు, చెరు వులు నిండు కుండలా మారాయి. మూడు వేల ఎకరాలకు పైగా పత్తి పంట, విత్తనాలు దెబ్బతినడంతో ఇప్పటి వరకు అయిన పెట్టుబడి ఖర్చులు దాదాపు రూ.మూడు కోట్ల కుపైగా నష్టం వాటిల్లినట్లు తెలు స్తోంది. రెండు మండలాల అధికా రులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులు సైతం కోతకు గురవడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు అంటున్నారు.


అలుగు పారుతున్న తీగలకుంట

ఉప్పునుంతల: మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లత్తీపూర్‌, గువ్వలోనిపల్లి గ్రామాల్లోని తీగలకుంట, మర్రికుంట చెరువు అలుగు పారుతున్నాయి. పెనిమిళ్ల గ్రామ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. మీటరు లోతు గోతి ఏర్పడింది. రోడ్డు ప్రక్కన ఇంటర్‌నెట్‌ కోసం వేసిన కేబుల్‌ తేలింది. జిల్లాలో ఎగువన కురిసిన వర్షాలకు దుందుభీ వాగుకు వరద నీరు చేరుతుండటంతో పరివాహక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  


చెరువులు కుంటల్లోకి నీరు

మన్నునూర్‌: అమ్రాబాద్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షానికి 15 రోజుల కిందట రైతులు నాటిన పత్తి మెలకలు దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. అమ్రాబాద్‌ సమీపంలోని వంకేశ్వరం చెరువు వద్ద మద్దిమడుగు-అచ్చంపేట ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాత్రి వేళ ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


జడ్చర్లలో భారీ వర్షం

 జడ్చర్ల: జడ్చర్లలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో ఇళ్లలోకి నీరు చేరింది. అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా సుమారు నాలుగు గంటల పాటు వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పట్టణంలోని నేతాజీ చౌరస్తా నుంచి సిగ్నల్‌గడ్డకు వెళ్లే దారిలో వెంకటరమణ టాకీస్‌ వద్ద ప్రధాన రోడ్డుపై నీరు నిలిచి, చిన్నపాటి చెరువును తలపించింది. లోతట్టు ప్రాంతాలైన మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు పెద్దమోరీ సమీపంలోని కొన్ని ఇళ్లల్లోకి, 13వ వార్డులోని చైతన్యనగర్‌ కాలనీ, 26వ వార్డులోని వెంకటేశ్వర కాలనీలోని కొన్ని ఇళ్లల్లోకి, వెంకటేశ్వర కాలనీలోని కొన్ని ఇళ్లల్లో నీళ్లు చేరాయి. వెంకటేశ్వర కాలనీలోని ఓ ఇంటి ముందు పార్క్‌ చేసిన కారులోకి నీళ్లు వచ్చాయి. రాజీవ్‌కాలనీకి వెళ్లే దారి కూడా మూసుకుపో, అక్కడా ఇళ్లల్లోకి నీరు చేరింది. భారీ వర్షం కురవడంతో మునిసిపల్‌ కమిషనర్‌, కౌన్సిలర్‌లు, అధికార పార్టీ నాయకులు ఉదయం నుంచే సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు నిండటంతో ఎక్స్‌కవేటర్‌ సహాయంతో వాటిలోని మట్టి, చెత్తా చెదారాన్ని తొలగించారు.


మురుగు కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

జడ్చర్ల మునిసిపాలిటీలోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద మురుగు కాలువను జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి పరిశీలించారు. పాతబజారు ప్రాంతం నుంచి మురుగునీటితో పాటు వర్షపు నీరంతా అదే కాలువ గుండా లోతట్టు ప్రాంతంగా ఉన్న నల్లకుంట మినీ ట్యాంకు వైపు వస్తాయని, నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.









Updated Date - 2022-06-20T04:49:23+05:30 IST