Abn logo
Jul 3 2020 @ 05:16AM

పుడమికి పండగ

జోరుగా వానకాలం సాగు పనులు

సహకరిస్తున్న వాతావరణం

ఆశించిన మేర వర్షాలు

70 శాతం పత్తి విత్తడం పూర్తి


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)  

వానాకాలం పంటల సీజన్‌ కళకళలాడుతోంది. వ్యవసాయ పనులతో పల్లెలు శోభను సంతరించుకుంటు న్నాయి. మే చివరి వారం నుంచే వర్షాలు కురుస్తుం డటంతో రైతులు పంటలు వేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. జిల్లాలో ప్రధాన పంట పత్తి విత్తడం 70 శాతం పూర్తయ్యిది.  వరి నారు మడులను సిద్ధం చేసుకుంటారు.  ముందస్తు వర్షాలు ప్రారంభం కావడంతోపాటు ఆశించిన మేర వానలు కురియడంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి.


ఆశాజనకంగా వర్షాలు 

వర్షాలు రైతన్న హర్షించేలా కురుస్తున్నాయి. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌ నెలలో 168.4 శాతం సాధారణ వర్షపాతం కాగా ఇప్ప టికే 203.1 శాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటికి 35 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం.  భీమిని మండలంలో మాత్రమే లోటు వర్షపాతం నమో దు కాగా, 8 మండలాల్లో సాధారణం, మిగతా మండ లాల్లో అదిక వర్షపాతం నమోదైంది. 


తెల్లబంగారంపైనే ఆశలు

జిల్లాలో ప్రధాన పంట పత్తిపైనే రైతులు గంపెడాశలతో ఉన్నారు. ఈ సారి  నియంత్రిత పంటల సాగులో భాగంగా పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని సర్కారు సూచించడంతో అధికారులు సైతం పత్తి రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం కంటే జిల్లాలో ఈ ఏడు మరో 30 వేల ఎకరాల్లో పత్తి సాగు పెరుగుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈసారి జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుం ది. పత్తికి అనుకూలంగా వర్షాలు కురుస్తుండటంతో పత్తి విత్తనాలు వేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఎండకాలంలోనే లోతు దుక్కులు వేసుకున్న రైతులు కల్టివేటర్‌, రోటివేటర్లతో చదును చేసుకొని విత్తులు నాటుతున్నారు. జూన్‌ నెలాఖరులోగా విత్తుకుంటే ఆశిం చిన దిగుబడులు వస్తాయని రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటికి  75 శాతం రైతులు పత్తి విత్తనాలు వేయడం పూర్తి చేశారు. 


జూన్‌ నుంచి కురిసిన వర్షపాతం వివరాలు

జిల్లాలో జూన్‌ 1 నుంచి జూలై 2వ తేదీ వరకు 236.8 మి.మీల వర్షం కురిసింది. సాధారణం 209.5 మి.మీలు కాగా, 13 శాతం అత్యధికంగా కురిసింది. వరుసగా 18 మండలాలలో 32 రోజులుగా కురిసిన వర్షం వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారం 204.5మి.మీలు, దండేపల్లి 194.8 మి.మీలు, లక్షెట్టిపేట 184.6 మి.మీలు, హాజీపూర్‌ 314.62 మి.మీలు, కాసిపేట 290.2 మి.మీలు, తాండూర్‌ 382 మి.మీలు, భీమిని 159.8మి.మీలు, కన్నెపల్లి 204.2మి.మీలు, వేమనపల్లి 231.2మి.మీలు, నెన్నెలలో 251 మి.మీలు, బెల్లంపల్లిలో 231.1మిమీలు, మంద మర్రిలో 181.1 మి.మీలు, మంచిర్యాలలో 237.4 మి.మీలు కురిసింది. అలాగే నస్పూర్‌ 237.5 మి.మీలు, జైపూర్‌ 242.4 మి.మీలు, భీమారం 246.1మి.మీలు, చెన్నూర్‌ 194.5 మి.మీలు, కోటపల్లిలో 276.6 మి.మీలు మొత్తం 236.8 మి.మీల వర్షం కురిసింది. అత్యధికం 111 శాతం తాండూర్‌లో, 52 శాతం హాజీపూర్‌లో, 33 శాతం నెన్నెలలో, 59 శాతం కోటపల్లిలో, 21 శాతం బెల్లంపల్లిలో అధికంగా వర్షం కురిసింది. 

Advertisement
Advertisement