పడకలు పెంచండి!

ABN , First Publish Date - 2022-01-19T07:38:54+05:30 IST

పడకలు పెంచండి!

పడకలు పెంచండి!

కరోనా మహమ్మారి కమ్ముకొచ్చేసింది 

వెంటనే ఆస్పత్రులను నోటిఫై చేయాలి

జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు 

విశాఖలో 73, కృష్ణాలో 48 ఆస్పత్రులు రెడీ

గుంటూరులో ఆస్పత్రులన్నీ కిటకిట 

చిత్తూరులో నిండిన టీటీడీ గెస్ట్‌హౌస్‌లు  

కలెక్టర్ల పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రులు 

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 50శాతం పడకలు


అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కరోనా మహమారి ఉధృతితో ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జిల్లాల్లో కలెక్టర్లను రంగంలోకి దించింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు బోధనాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులను కొవిడ్‌ ఆస్పత్రులుగా నోటిఫై చే యాలని ఆదేశించింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న విశాఖపట్నంలో 73 ఆస్పత్రులను నోటిఫై చేశారు. ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లు కలిపి దాదాపు 8వేల పడకలు సిద్ధం చేశారు. చిత్తూరులో ప్రయివేటు ఆస్పత్రులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంట ర్లు నిండిపోతున్నాయి. ఇవికాకుండా విష్టునివాసం, శ్రీనివాసం, పద్మవతి నిలయాలను కూడా క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చేశారు. అ యినా పడకలు అందుబాటులో ఉండటం లేదు. సోమవారం విష్టునిలయం వద్ద కొవిడ్‌ బాధితులు ఆహారం కోసం ధర్నా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రోజు కు 1,500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కృష్ణాజిల్లాలో 48 ఆస్పత్రులను నోటిఫై చేశారు. ఆయా ప్రభుత్వ, ప్రయివేటు బోధనాస్పత్రుల్లో 75శాతం పడకలు కలెక్టర్‌ పరిధిలోకి తీసుకున్నారు. మిగిలిన ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ 50శాతం పడకలు తమకు కేటాయించాలని ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు సర్క్యులర్‌ జారీ చేశారు. కొవిడ్‌ బాధితులు లేకున్నా ఆ మేరకు పడకలు కేటాయించాల్సి ఉంటుంది. ఇక గుంటూరు బోధనాసుపత్రి మొత్తం కొవిడ్‌ రోగులతో నిండిపోయింది. కరోనా వార్డుల్లో ఒక్క పడక కూడా అందుబాటులో లేదు. గుంటూరు జీజీహెచ్‌లో ఒక్కరోజే వంద పడకలు ఫుల్‌ అయ్యాయి. దీంతో జీజీహెచ్‌ అధికారులు మరో రెండు వార్డులను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 


పాజిటివ్‌లు తగ్గించండి...

కరోనా పాజిటివిటీ రేటును తగ్గించడానికి కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రయివేటు ల్యాబ్‌లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. డీఎంహెచ్‌వోల ద్వారా ల్యాబ్‌లకు ఫోన్లు చేయిస్తున్నారు. కరోనా బాధితుల్లో పాజిటివ్‌ వచ్చినవారి రిపోర్టులను, వివరాలను ఐసీఎంఆర్‌లో నమోదు చేయొద్దని స్పష్టంగా చెబుతున్నారు. టెస్టింగ్‌ పూర్తి అయిన తర్వాత పాజిటివ్‌ వచ్చిన వాటిల్లో 10నుంచి 15శాతం బాధితుల వివరాలు మాత్రం అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలిస్తున్నారు.  పాజిటివిటీ రేటు తగ్గించే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-01-19T07:38:54+05:30 IST