Aug 4 2021 @ 01:35AM

‘రైతన్న రుణం తీర్చుకోవాలి’

సామాజిక అంశాలను, సమకాలీన  సమస్యలను ఇతివృత్తాలుగా  ఎన్నుకొని, తనదైన రీతిలో సినిమాలు రూపొందించే దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి తాజా చిత్రం ‘రైతన్న’. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో ఆయన తీసిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణ మూర్తితో చిత్రజ్యోతి ముచ్చటించింది.


ఇంతకుముందు  రైతు సమస్యలతో  మీరు తీసిన ‘చీమలదండు’, ‘వేగుచుక్కలు’ వంటి చిత్రాలకూ, ఈ చిత్రానికి ఉన్న తేడా ఏమిటి?’

కార్మిక, కర్షకుల ఐక్యతను చాటి చెప్పిన చిత్రం ‘చీమలదండు’, ప్రపంచ వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల, ప్రపంచ బ్యాంక్‌ షరతులకు లోబడి, ఇండియా లాంటి వర్ధమాన దేశాలు అనేక ఇబ్బందులకు గురయ్యాయి.  రైతులు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ తీసిన చిత్రమే ‘వేగుచుక్కలు’. అయితే ఆ రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది ‘రైతన్న’ సినిమా. నూతన వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయం కూడా ప్రయివేటు పరం అయిపోతుంది. రైతు స్వేచ్ఛను కోల్పోయి, తన చేనులో తనే కూలిగా మారే ప్రమాదం ఉంది. అందుకే తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎనిమిది నెలలుగా రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం  చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ చట్టాలు రైతులకు వరాలు కాదు.. శాపాలు. ఈ అంశాలన్నీ ‘రైతన్న’ చిత్రంలో చర్చించాం. ఎవరి వాదన ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 


ఏ దళారి లేకుండా రైతు పండించిన పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని ఈ చట్టంలో ఉంది కదా! మరి రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రభుత్వం చెప్పింది కానీ ఇంత ధర పెట్టి రైతు పంటని కొనమని అంటూ కనీస మద్దతు ధరని నిర్ణయించలేదు. ఆ అంశాన్ని చట్టంలో పేర్కొనకపోవడం వల్ల వ్యాపారస్తుల ఇష్టారాజ్యం అయిపోతుంది. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా తమ ఉత్పత్తులకు మార్కెట్‌ ధర నిర్ణయించే అవకాశం ఉంది. కానీ ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఽరైతు కాకుండా ఆ ధరలను మార్కెట్లే  నిర్ణయిస్తాయి. వ్యాపారస్తుల మాటే వేదం అవుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి, ధరను నిర్ణయించకపోతే రైతును వ్యాపారస్తులు పీల్చి పిప్పి చేస్తారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని, గిడ్డంగుల్లో నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తారు. డిమాండ్‌ అండ్‌ సప్లయి అని చెప్పి వినియోగదారులను దోచుకుంటారు. ఇటువంటి చట్టాల వల్ల అటు రైతులకు, ఇటు ప్రజలకు నష్టం కలుగుతుంది.. అందుకే  స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులకు చట్టబద్థత కల్పించాలని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది కదా?

అది వాస్తవం కాదండీ. రైతు తను పండించే పంటకు పడే శ్రమ, కుటుంబ శ్రమ, పెట్టుబడి, వడ్డీలు.. ఇవన్నీ పోను అదనంగా 50 శాతం లాభం ఇవ్వమని స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసింది. కానీ అలా ఇవ్వడం లేదు. అందుకే రైతులు ఉద్యమ బాట పట్టారు. ఈ రోజున ఎరువుల ధరలు, విత్తనాల రేట్లు, కూలీ ఖర్చులు.. అన్నీ పెరిగిపోయాయి. దీని వల్ల రైతు ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులకు చట్టబద్ధత కల్పించి, రైతులను ఆదుకోవాలని మా ‘రైతన్న’ చిత్రంలో చెప్పాను.  అలాగే ఆహార భద్రతా చట్టాన్ని, ధరల నియంత్రణ చట్టాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాను. కొనుగోలు కేంద్రాలు, మండీలు లేకుండా, ప్రభుత్వం ధర నిర్ణయించకుండా రైతులు తమకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చని 2006లో బీహారులో ఓ చట్టం చేశారు కదా.

నిజమే కానీ ఈ చట్టం వల్ల రైతులకు మేలు జరగకపోగా, నష్టమే ఎక్కువగా జరిగింది. అక్కడ వ్యాపారస్తులదే ఇష్టారాజ్యం అయింది. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పక్కనున్న రాష్ట్రాల కంటే తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు బీహారులో రైతులు లేరు.. అందరూ రైతు కూలీలే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా బీహారులా రైతులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది. దాన్ని రద్దు చేయాలని రైతు సోదరులు పోరాటం చేస్తున్నారు. 


నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని కూడా రైతులు ఎందుకు వద్దంటున్నారు?

ఈ విద్యుత్‌ సంస్కరణల చట్టం వల్ల కరెంట్‌ మొత్తం ప్రైవేట్‌ పరం అయిపోతుంది. మళ్లీ కొత్త కరెంట్‌ రేట్లు, బిల్లులు పుట్టుకు వస్తాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళల్లో ముఖ్యమంత్రులు రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇవ్వడమే కాకుండా రైతుబంధు పథకాలు, సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల, విద్యుత్‌ సంస్కరణల చట్టాల వల్ల ఈ రాయితీలన్నీ రైతులు కోల్పోతారు. అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు.

సినిమా

అంతా రైతుల గురించేనా..కౌలు రైతుల ప్రస్తావన కూడా ఉంటుందా?

మనదేశంలో ఒకప్పుడు 75 శాతం వ్యవసాయ రంగం ఉండేది. ఇప్పుడది 52 శాతానికి వచ్చింది. ఇందులో 41 శాతం మంది కౌలు రైతులే! నా దృష్టిలో రైతు, కౌలు రైతు అని ఇద్దరు లేరు. భూమిని నమ్ముకొని బతికే ప్రతి ఒక్కడూ రైతే.


రైతు కుటుంబాలతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారని వింటున్నాం. ఆ ప్రస్తావన కూడా మీ సినిమాలో ఉందా?

మా సినిమాలో మెయిన్‌ పాయింట్‌ అదేనండీ. ఈ రోజు సామాజికంగా వెనుకబడిన జాతి ఏదైనా ఉంటే అది రైతు జాతే. అడుగడుగునా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న రైతు బతుక్కి ఇప్పుడు గ్యారంటీ లేకుండా పోయింది. అందుకే వాళ్లతో సంబంధాలు కలుపుకోవడానికి చాలా మంది వెనుకాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ హక్కుల కోసం రైతులు ఎలా పోరాటం చేసి, గిట్టుబాటు ధర పొందారో సినిమాలో చూపించాం. అలాగే చిత్ర కథానాయకుడు రంగారావు (అంటే నేనే)ఆగిపోయిన తన కూతురి పెళ్లిని ముఖ్యమంత్రి సమక్షంలో జరిపిస్తాడు. ‘వ్యవసాయం దండగ కాదు.. పండగ’ అని నిరూపిస్తాడు.


రెండేళ్లుగా కరోనా కష్ట కాలంలో ప్రజలు భయకంపితులై మాస్కులు ధరించి, శానిటైజర్లు రాసుకొని ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ రైతులు అవేమీ లేకుండా ఆరుగాలం కష్టపడుతూ, మూడు పంటలు పండిస్తూ మన అందరికీ అన్నం పెడుతున్నారు. ఆ అన్నదాతల రుణం తీర్చుకోవాలంటే వారి డిమాండ్స్‌ నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే, మరో విషయం చెప్పాలి... ‘రైతన్న’ చిత్రంలోని పాటలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావు పాడారు. వారికి నా నివాళులు. చిత్రం సెన్సార్‌ కూడా పూర్తయింది. ఈ నెల 14న విడుదల చేస్తున్నాం.  తన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాక, అప్పులు తీర్చలేక అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆ పరిస్థితి రాకూడదనీ, అన్నదాత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రం ‘రైతన్న’.