అన్నదాతకు కోటి కష్టాలు

ABN , First Publish Date - 2021-06-17T05:10:52+05:30 IST

వైరా మండల రైతులు గత ఏడాది వాన, యాసంగికాలాల వ్యవసాయ సీజన్ల కష్టనష్టాల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నారు.

అన్నదాతకు కోటి కష్టాలు
ఇంకా రోడ్లపైనే ఉన్న ధాన్యం బస్తాలు

 ఏడాదిగా విరామం ఎరుగని రైతులు

 వానాకాలం సీజన్‌ వచ్చినా పూర్తికాని సాగు తతంగం

వైరా, జూన్‌ 16: వైరా మండల రైతులు గత ఏడాది వాన, యాసంగికాలాల వ్యవసాయ సీజన్ల కష్టనష్టాల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాది కాలం మండలంలోని రైతులు ఒక్కరోజు కూడా విరామం ఎరుగలేదు. ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రవేశించి దాదాపు పక్షంరోజులు కావస్తున్నా గడిచిన యాసంగి సీజన్‌ వ్యవసాయ పనుల నుంచి ఇంకా బయటపడలేదు. ఏడాది నుంచి విశ్రమించని అన్నదాత లకు తగిన ఆదాయం శూన్యం. అప్పుల ఊబిలోనే ఉండిపోయారు. అయినప్పటికీ అన్నదాతలు తమ కష్టనష్టాన్ని దరిచేరనివ్వకుండా మళ్లీ ఈ ఏడాది వానా కాలం వ్యవసాయ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. 


కష్ట నష్టాలు


గత ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్‌లో వరి, పత్తి, పెసర, మిర్చి, మొక్కజొన్న ఇతర మరికొన్నిరకాల పంటలు సాగుచేశారు. అధిక వర్షాల వలన పెసర పూర్తిగా దెబ్బతిన్నది. ఒక్కో ఎకరాకు రూ.40వేలు ఆదాయం వస్తుందని భావించిన పెసర రైతులకు ఒక్కపైసా కూడా చేతికి రాలేదు. ఈ పంట మొత్తం వర్షార్పణమైంది. పత్తి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. రైతులకు కనీసం దుక్కుల ఖర్చులు కూడా రాలేదు. మిర్చి రైతులకు మాత్రం పెట్టుబడులు వచ్చాయి. ఇక ధాన్యం రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రభుత్వం సన్నరకాలు మాత్రమే సాగుచేయాలనే ఆంక్షల ఫలితంగా రైతులు నష్టపోయారు. అధిక వర్షాల వలన దోమకాటు, మెడవిరుపు ఇతర చీడపీడల వలన విపరీతంగా పెట్టుబడులు పెరిగిపోయాయి. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ధాన్యం రైతులకు పెట్టుబడి కూడా రాలేదు. అయినప్పటికీ సాగునీరు పుష్కలంగా ఉండటంతో యాసంగి సాగుచేపట్టారు. 


గిట్టుబాటు దక్కని వైనం


వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వలు, ఎన్నెస్పీ కాల్వల పరిధిలో ఎత్తిపోతల పథకాలు ఇతర సాగునీటి వనరుల కింద యాసంగి వరిసాగుచేశారు. అయితే పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ కొనుగోళ్లతోనే రైతులకు పెద్ద తలనొప్పి అయింది. 1121రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఆరకం సాగుచేసిన రైతులు బస్తా ధాన్యాన్ని కేవలం రూ.900కు అయినకాడికి విక్రయించుకొని తీవ్రంగా నష్టపోయారు. 


కల్లాల్లోనే ధాన్యం


సహకార సంఘాలు, డీసీఎంఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేసినప్పటికీ రెండునెలల నుంచి ఒక ప్రవాసనంగా మారింది. నెలరోజుల కిందట కాంటా వేసిన ధాన్యం బస్తాలను నేటికీ తరలించకపోవడంతో రోడ్లు, కల్లాలపై కుప్పలుతెప్పలుగా పడిఉన్నాయి. గత మేలో ప్రస్తుత నెలలో ఏడెనిమిదిసార్లు కురిసిన వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోయి అడుగున చెద వచ్చి మొలకలు వచ్చాయి. మిల్లుల కేటాయింపు సమస్య, లారీలు, గన్నీసంచుల కొరత, మిల్లర్ల వేధింపులు వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. క్వింటా ఒక్కింటికి 8నుంచి 10కిలోల ధాన్యాన్ని అడ్డంగా మిల్లర్లు దోచుకున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న లారీల వాళ్లు బస్తా ఒక్కింటికి రూ.10నుంచి రూ.15వరకు డిమాండ్‌ చేసి వసూలు చేశారు. ఇన్ని అష్టకష్టాల మధ్య గడిచిన ఏడాది కాలంగా రైతులు కనీస విరామం లేకుండా ఆందోళన చెందుతున్నారు. గత వేసవి వ్యవసాయ సీజన్‌ పనులు మరోపక్షం రోజులైనా ముగుస్తాయా లేదోననే ఆందోళనతో రైతులు ఉన్నారు. రైతుల పట్ల అంతటా చూపిస్తున్న అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది.


Updated Date - 2021-06-17T05:10:52+05:30 IST