Abn logo
Jun 11 2021 @ 04:40AM

ధరణి లెక్కల ప్రకారమే ‘రైతుబంధు’!

గత యాసంగి తర్వాత 1.11 లక్షల మ్యుటేషన్‌ దరఖాస్తులు

లబ్ధిదారుల సంఖ్య 59.54 లక్షల మందికి పెరిగే అవకాశం

15 నుంచి రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ నగదు బదిలీ


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో రైతుబంధు పంపిణీ చేసేందుకు కసరత్తు జోరుగా సాగుతోంది. లబ్ధిదారుల తుది జాబితా రూపకల్పనకు సీసీఎల్‌ఏ- ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌) కృషిచేస్తున్నాయి.  ‘ధరణి’ పోర్టల్‌ ఆధారంగానే రైతుబంధు లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేస్తున్నారు. గత యాసంగి సీజన్‌ తర్వాత భూముల క్రయవిక్రయాలు, యాజమాన్య హక్కుల బదిలీల్లో జరిగిన మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారులను ఖరారుచేస్తున్నారు. దీంతో వానాకాలానికి రైతుబంధు పొందే లబ్ధిదారుల సంఖ్య 59.54 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 61,34,266 మంది భూ పట్టాదారులు ఉన్నారు. వీరిలో 46,67,749 మంది రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ నంబర్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. 11,75,225 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పక్కాగా ఉన్నప్పటికీ... ఇటీవల జరిగిన బ్యాంకుల విలీనంతో ‘ఐఎ్‌ఫఎస్‌’ కోడ్‌ నెంబర్లు మారాయి. రైతుల బ్యాంకు అకౌంట్లకు, మారిన ఐఎ్‌ఫఎ్‌ససీ నంబర్లను సీడింగ్‌ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


దీంతో 58,42,974 లక్షల మంది రైతుల సమగ్ర వివరాలు వ్యవసాయశాఖ వద్దకు చేరతాయి. ఇదిలాఉండగా.. గడిచిన యాసంగి సీజన్‌లో రైతుబంధు పంపిణీ పూర్తయిన తర్వాత జరిగిన భూముల క్రయవిక్రయాలు, యాజమాన్య హక్కుల బదిలీ, కొత్తగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కటాఫ్‌ డేట్‌ ఇచ్చిన జూన్‌ 10 వరకు 1,11,317 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,10,900 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. ధరణిలో నమోదైన పట్టాదారులందరినీ ఈ వానాకాలం రైతుబంధు పథకం లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. పార్ట్‌- బి నుంచి ఏ లోకి మారిన భూములనూ పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో 23 వేల దరఖాస్తులు వచ్చాయి. రైతుబంధుకు రూ.7,368 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యతో బడ్జెట్‌ రూ.7,400 కోట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి.


ఎకరం నుంచి మొదలు

రైతుబంధు నిధుల పంపిణీని 11 రోజుల్లో(జూన్‌ 15 నుంచి 25 వరకు) పూర్తిచేయాలని కేసీఆర్‌ ఆదేశించిన విషయం విదితమే! నగదు బదిలీని ఆరోహణ క్రమంలో(తక్కువ నుంచి ఎక్కువకు) చేపట్టనున్నారు. మొదటి రోజు(జూన్‌ 15న) ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు, రెండో రోజు... 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు, మూడో రోజు... మూడెకరాలు ఉన్న రైతులకు... ఇలా పదో రోజున... పదెకరాలలోపు ఉన్న రైతులకు నగదు బదిలీచేస్తారు. పదెకరాలకు మించి ఉన్న రైతులకు 11వ రోజున నగదు బదిలీచేసి ఈ సీజన్‌ పక్రియను ముగిస్తారు.

Advertisement