‘బంధు’ ముద్దు.. వద్దొద్దు!

ABN , First Publish Date - 2021-06-11T10:28:59+05:30 IST

కోట్లలో ఆదాయపన్ను కట్టేవాళ్లకు, బెంజ్‌ కార్లలో తిరిగేవారికి రైతుబంధు సాయం ఇస్తే సామాన్య రైతులు ఏం కావాలి?’ అంటూ ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించడంతో రైతుబంధు పథకం చర్చనీయాంశమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2017లో రైతుబంధు పథకాన్ని

‘బంధు’ ముద్దు..  వద్దొద్దు!

మంత్రుల్లో కొందరికి రైతుబంధు సాయం..

స్వచ్ఛందంగా వదులుకుంటున్న ఇంకొందరు

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ‘గివ్‌ ఇట్‌’ ఆప్షన్‌తో తిరస్కరణ..

పెట్టుబడి సాయం పొందుతున్న వ్యవసాయ మంత్రి 

నిరంజన్‌ రెడ్డి, ఆయన భార్య పేరిట 42 ఎకరాలకు..

90 ఎకరాలకు సాయం వద్దంటూ పువ్వాడ అజయ్‌ లేఖ 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌ రెడ్డికి లబ్ధి


(ఆన్‌లైన్‌ న్యూస్‌నెట్‌వర్క్‌)

‘కోట్లలో ఆదాయపన్ను కట్టేవాళ్లకు, బెంజ్‌ కార్లలో తిరిగేవారికి రైతుబంధు సాయం ఇస్తే సామాన్య రైతులు ఏం కావాలి?’ అంటూ ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించడంతో రైతుబంధు పథకం చర్చనీయాంశమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2017లో రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సాగుభూములున్న రైతులకు ఏడాదిలో రెండుసార్లు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతుబంధు సాయం వద్దనుకునేవారు స్వచ్ఛందంగా వదులుకునేందుకు ప్రభుత్వం ‘గివ్‌ ఇట్‌’ ఆప్షన్‌ను ఇచ్చింది. అయితే వ్యవసాయం చేసే నిరుపేద రైతులకే రైతుబంధు పథకం వర్తించాలని పేర్కొన్న ఈటల స్వయంగా లబ్ధిదారు అని.. ఆయనతో పాటు భార్య, కుమారుడు రైతుబంధు సాయాన్ని పొందుతున్నారని తెలిసింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మొన్న యాసంగి దాకా ఈటల, ఆయన కుటుంబసభ్యులు పెట్టుబడి సాయం పొందారని తెలిసింది.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల్లో ఎంత మంది పథకం కింద సాయాన్ని పొందుతున్నారు? స్వచ్ఛందంగా వదులుకుంటున్న వారు ఎంతమంది? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కొందరు మంత్రులు పెట్టుబడి సాయాన్ని తీసుకొంటుంటే మరికొందరు స్వచ్చందంగా వదులుకుటున్నారు. ఇంకొందరేమో కొన్నిసార్లు వాపసు చేసి.. ఇంకొన్నిసార్లు వాడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన భార్య శోభ, మంత్రి కేటీఆర్‌ రైతుబంధు సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ ముగ్గురి పేరిట 100 ఎకరాలకు పైగానే  వ్యవసాయ భూమి ఉంది. ‘గివ్‌ ఇట్‌’ ఆప్షన్‌ కింద పెట్టుబడి సాయాన్ని వదులుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి కుటుంబం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందుతోంది. ఆయనకు, ఆయన భార్యకు కలిపి వనపర్తి జిల్లాలో 42 ఎకరాలున్నాయి.


ఈ భూమికి సంబంధించి ఇప్పటిదాకా రూ. 13,74,000 వారి ఖాతాలో పడ్డాయి. 2018 వానాకాలానికి సంబంధించి రూ.1.2లక్షలు మాత్రం ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు. మంత్రి శ్రీనివా స్‌గౌడ్‌ పెట్టుబడి సాయాన్ని వినియోగించుకోవడం లేదు. ఆయనకు ఇప్పటిదాకా రూ.2.5 లక్షల దాకా పెట్టుబడి సాయం రాగా.. అందులో మొదటి విడత కింద వచ్చిన రూ.25వేల చెక్కును వాపస్‌ చేశారు. మిగతా సొమ్మును పేద రైతుల ఇళ్లలో పెళ్లి ఖర్చులకు వినియోగించినట్లు చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్‌కు కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లో 27 ఎకరాలున్నాయి. పథకం తొలి రెండు విడతల కింద వచ్చిన సాయాన్ని ఆయన సర్కారుకు వాపసు చేశారు. ఒకసారి బ్యాంకు సమస్యలతో తీసుకోలేకపోయారు. గత వర్షాకాలంలో రూ. 1,35,000 తీసుకున్నారు.


రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కుటుంబం పెట్టుబడి సాయం తమకు వద్దంటూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. పువ్వాడ అజయ్‌ సతీమణి వసంతలక్ష్మి, కుమారుడు నయన్‌ పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 90 ఎకరాల భూమి ఉంది. పథకం తొలి రెండు విడతల్లో సుమారు రూ.7లక్షల చెక్కు రాగా సర్కారుకు అప్పగించారు. తర్వాత సాయం వద్దంటూ సర్కారుకు లేఖ సమర్పించారు. అప్పటి నుంచి వారికి రైతుబంధు రావడం లేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్లలో రెండెకరాలకు సంబంధించి రైతుబంధు సాయం పొందుతున్నారు.  వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో, కల్లెడలో, రోళ్లకల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు, ఆయన భార్యకు కలిపి 61.12 ఎకరాలున్నాయి. తన పేరిట ఉన్న 33.06 ఎకరాల భూమికి సంబంధించి ఎర్రబెల్లి, సీజన్‌కు రూ.1,65,750 చొప్పున తీసుకుంటున్నారు. ఆయన భార్యకు రూ. 1,40,750 చొప్పున  సాయం అందుతోంది. తొలి విడతలో మాత్రం చెక్కులను ప్రభుత్వానికి ఆమె తిరిగిచ్చేశారు. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేరిట మహబూబాబాద్‌ జిల్లాలో 5.2 ఎకరాలున్నాయి. ఆమెకు ఏటా రూ.50,500 రైతుబంధు అందుతోంది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు 6 ఎకరాల భూమి ఉంది.


గత ఏడాది ఓ పర్యాయం కింద రూ.30వేలు ఖాతాలో పడ్డాయి. అనంతరం తనకు రైతుబంధు సాయాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కొప్పుల కోరారు.  అప్పటి నుంచి ఆయన ఖాతాలో డబ్బులు జమకావడం లేదు. విద్యుత్తు శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి భార్య సునీత పేరిట నల్లగొండ జిల్లా నాగారం మండలం వర్థమానుకోటలో రెండెకరాల పొలం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఆమె రూ.36వేలు తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేరిట ఆరెకరాలున్నాయి. ఈ భూమికి సంబంధించి ఏటా రెండు పంటలకు కలిపి రూ.60వేలు తీసుకుంటున్నారు. పథకం తొలి విడత కింద చెక్కు రూపంలో వచ్చిన సాయాన్ని మాత్రం వదులుకున్నారు.

Updated Date - 2021-06-11T10:28:59+05:30 IST