తుగ్లక్‌ నిర్ణయాలతో సర్వనాశనం

ABN , First Publish Date - 2021-06-20T05:25:49+05:30 IST

తుగ్లక్‌ నిర్ణయాలతో పాలకులు రాష్ట్రాభివృద్ధిని సర్వనాశనం చేశారని రాజధాని రైతులు తెలిపారు.

తుగ్లక్‌ నిర్ణయాలతో సర్వనాశనం
తుళ్లూరు ధర్నా శిబిరంలో ఆందోళనలు చేస్తున్న మహిళలు

మూడుతో ఏపీపై దేశవ్యాప్తంగా చులకన 

550వ రోజు దీక్షల్లో అమరావతి రైతులు

సీఎం ఇల్లు ముట్టడిస్తారని పోలీసుల మోహరింపు


తుళ్లూరు, తాడికొండ, జూన్‌ 19: తుగ్లక్‌ నిర్ణయాలతో పాలకులు రాష్ట్రాభివృద్ధిని సర్వనాశనం చేశారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర  ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేస్తోన్న దీక్షలు శనివారంతో 550వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలు, మహిళలు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ మూడు రాజధానులని సీఎం జగన్‌ ప్రకటించడంతో దేశంలో ఏపీ రాష్ట్రంపై చులకన భావం ఏర్పడిందన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తే రాష్ట్రం ప్రగతి బాట పట్టేదన్నారు. ఎప్పుడైతే మూడు రాజధానులని సీఎం అన్నాడో ఆ రోజు నుంచి ఏ ఒక్క కంపెనీ, పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదన్నారు. పది వేల కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వ్యవసాయం లేక, సమయానికి కౌలు జమ చేయక కరోనా కష్ట కాలంలో ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా రాజధాని నిర్మాణం జరిగి ఐదేళ్ల నుంచి రాష్ట్ర పాలన ఇక్కడ నుంచి జరుగుతుందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే విరిమించుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. భూములు అభివృద్ధి చేయకుండా అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జై అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు శనివారం నిరసనలు తెలిపారు.


ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు 

రాజధాని ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం రైతులు సీఎం ఇల్లు ముట్టడిస్తారనే పుకార్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు.   రాజధాని గ్రామాలు, ధర్నా శిబిరాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయం, సీఎం నివాసం తాడేపల్లి వైపు వెళ్ళే ప్రతి ఒక్కరిని తనిఖీ చేశారు. రాజధాని రైతు అయితే మాత్రం ఆ ప్రాంతాల వైపు వెళ్లనీయకుండా వెనక్కి పంపారు.  ఎక్కడకక్కడ  చెక్‌  పోస్టులు ఏర్పాటు చేసి రాజధాని రైతులు, నాయకులపై నిఘా పెట్టారు.   

Updated Date - 2021-06-20T05:25:49+05:30 IST