అమరావతిని శిథిలం చేస్తారా?

ABN , First Publish Date - 2021-07-30T05:47:08+05:30 IST

ప్రజా రాజధాని అమరావతిని శిఽథిలం చేసేందుకు ప్రస్తుత పాలకులు కుటిలయత్నాలు చేస్తున్నారని రాజధాని రైతులు పేర్కొన్నారు.

అమరావతిని శిథిలం చేస్తారా?
పెదపరిమి శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

 రూ.పది వేల కోట్ల ప్రజా ధనంతో రాజధాని పనులు

వాటికి నేడు రక్షణ కరువు

మట్టి, కంకరును దోచుకున్నవారిని అరెస్టు చేయాలి..

590వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు


తుళ్లూరు, జూలై 29: ప్రజా రాజధాని అమరావతిని శిఽథిలం చేసేందుకు ప్రస్తుత పాలకులు కుటిలయత్నాలు చేస్తున్నారని రాజధాని రైతులు పేర్కొన్నారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేపట్టిన ఉద్యమం గురువారం 590వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్ష శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అనుచరులే రోడ్లను తవ్వేసి కంకరు, మట్టి, ఐరన్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు.  ప్రజావేదికతో ప్రారంభమైన కూల్చివేతల పర్వం రాజధానిలో నిర్మించిన రోడ్లను తవ్వే వరకు వచ్చిందన్నారు. దాదాపు రూ.పదివేల కోట్ల ప్రజాధనంతో రాజధాని పనులు జరిగాయని తెలిపారు. వాటికి ఈ ప్రభుత్వం నుంచి రక్షణ ఉంటుందా.. అనే సందేహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత రాష్ట్ర న్యాయస్థానం కలుగజేసుకోవాలని అభ్యర్థించారు. సాధ్యం కాకపోయిన అమరావతిని నాశనం చేయాలనే ఒకే ఒక కుట్రతో రాజధానిలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైతులపై అక్రమ పేసులు పెట్టి వారి శాంతియుత కార్యక్రమాలను అడ్డుకునే పోలీసులు, రోడ్లను ధ్వంసం చేసినవారిని ఎందుకు పట్టుకోలకపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాత్రి ఏడుగంటల సమయంలో దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతికి వెలుగును ప్రసాదించాలని న్యాయదేవతను వేడుకున్నారు. 

Updated Date - 2021-07-30T05:47:08+05:30 IST