అన్నదాతల గోడు వినరా?

ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST

రాజధానికి భూములు త్యాగం చేసిన తమను ప్రస్తుత పాలకులు అవమానాలు, అవహేళనలు చేస్తున్నా తట్టుకుంటున్నామని రైతులు, మహిళలు అన్నారు.

అన్నదాతల గోడు వినరా?
మందడం శిబిరంలో ఎమ్మెల్యే శ్రీదేవి చిత్రపటంతో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

త్యాగాలు చేసిన మమ్మల్ని రోడ్డున పడేస్తారా..? 

352వ రోజుకు చేరిన ఉద్యమం


తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి, డిసెంబరు 3:  రాజధానికి భూములు త్యాగం చేసిన తమను ప్రస్తుత పాలకులు అవమానాలు, అవహేళనలు చేస్తున్నా తట్టుకుంటున్నామని రైతులు, మహిళలు అన్నారు. తమ గోడు వినే ఓపిక కూడా వారికి లేదన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు గురువారం 352వ రోజుకు చేరుకున్నాయి. ఆయా శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ రైతులంటేనే సీఎం జగన్‌కు ఇష్టం లేదన్నారు. మందడం ధర్నా శిబిరం ముందు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని దిష్టిబొమ్మలను ఉంచి.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది వీరేనని  మహిళలు నినాదాలు చేశారు. మందడం శిబిరం నుంచి బయలుదేరిన రైతులు, మహిళలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శిబిరం నుంచే ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా మూడు రాజధానులు ప్రతిపాదన మానుకోవాలన్నారు.  తమ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదంటూ మందడం శిబిరంలో మహిళలు ఆమె చిత్రపటంతో నిరసన చేపట్టి నినాదాలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో మేధావుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్ష కొనసాగింది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు దీక్షలు కొనసాగించారు.

Updated Date - 2020-12-03T05:30:00+05:30 IST