జాతీయ జెండా.. జై అమరావతి

ABN , First Publish Date - 2021-01-27T05:32:29+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని రైతుల శిబిరాల వద్ద రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

జాతీయ జెండా.. జై అమరావతి
అబ్బరాజుపాలెం రైతు శిబిరం వద్ద త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న రైతులు, మహిళలు

రైతు శిబిరాల వద్ద ఎగిరిన మువ్వన్నెల పతాకం

రైతులకు చిత్తూరు జిల్లా మహిళల సంఘీభావం

406వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని రైతుల శిబిరాల వద్ద రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శిబిరాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ చిత్రపటాలకు, న్యాయదేవతకు పూజలు చేశారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు నినాదాలు చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారానికి 406వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరంగా పాలన చేస్తే కోర్టుల జోక్యం ఉండదన్నారు. నమ్మించి గొంతుకోస్తున్నందునే జగన్‌ అన్యాయ పాలనను న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయన్నారు.  చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మహిళలు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు 406వ రోజూ కొనసాగాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామ రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని రైతుల సమస్య పరిష్కారం అవ్వాలని జాతీయ నాయకులు చిత్రపటాలకు మొరపెట్టుకున్నారు.


అమరావతి పోరుకు అండ : శివస్వామి 

అమరావతి రైతుల పోరాటం ఢిల్లీ స్థాయికి వెళ్లేందుకు అండగా ఉంటామని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ నెల 18 నుంచి చేపట్టిన శ్రీవిద్యా యాగం పూర్హాహుతితో మంగళవారం ముగిసింది. యాగం అనంతరం అమరావతి సంకల్ప సభలో శివస్వామి మాట్లాడుతూ అమరావతి రైతులు శిబిరాల్లో కూర్చొని కన్నీళ్లు కారిస్తే న్యాయం జరగదన్నారు. పోరాటం ఢిల్లీ స్థాయి లో ఉండాలన్నారు. పోరాటంలో స్వామీజీలు కూడా భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నా రని, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామన్నారు. న్యాయం కోసం స్వామీజీలు, పీఠాధిపతు లు ముందుకు వస్తారని చెప్పారు. దేవాలయాలపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు సరిగా స్పందించడం లేదన్నారు. విద్యానభారతీ స్వామీజీ మాట్లాడుతూ గోవులను, దేవాలయాలను కాపాడుకోవటం అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో మురళీధరన్‌స్వామి, అఘోరానందస్వామిజీ, సదానందస్వామీజీ, మారుతీ మహానంద స్వామీజీ, అతిదేశ్వరానంద స్వామీజీ, విష్ణు మహేశ్వర స్వామీజీ, రైతు జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్‌, కొలకిలపూడి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూజా కలశాన్ని రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి తీసుకెళ్లి యాగం క్రతువును పూర్తి చేశారు.  

Updated Date - 2021-01-27T05:32:29+05:30 IST