Abn logo
Oct 22 2021 @ 00:54AM

మాట తప్పారు.. మడమ తిప్పారు..

పెదపరిమి శిబిరంలో నినాదాలు చేస్తున్న రాజధాని మహిళలు

   అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన

రాష్ర్టాన్ని అధోగతి పాలు చేశారు..

674వ రోజు దీక్షా శిబిరాల్లో రైతులు 


తుళ్లూరు, అక్టోబరు 21: ఇచ్చిన ప్రతి హామీలోనూ సీఎం జగన్‌రెడ్డి మాట తప్పారు.. మడమ తిప్పారు అని రాజధాని రైతులు ఆరోపించారు. అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామని నాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చెప్పి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని అన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం గురువారం 674వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని కాదంటే అమ్మను కాదన్ననట్టేనన్నారు. ఐదుకోట్ల మందికి అందుబాటులో, రాష్ట్ర నడి బొడ్డున అన్నీ సౌకర్యాలతో రాజధాని అమరావతి నగరం ఏర్పడుతుంటే ఓర్చుకోలేని పాలకులు నిర్వీర్యం చేయటానికి కుట్ర పన్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలతో ఐదుకోట్ల మంది కలల రాజధాని అమరావతిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలకు విలువ లేకుండా అవహేళనలు చేయటం దుర్మార్గమన్నారు. ఐదేళ్ల నుంచి పాలన అమరావతి నుంచే జరుగుతోందని, అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.