రజకుల చెరువు స్వాధీనంపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-08-01T06:10:25+05:30 IST

కైకలూరులో రజకుల చెరువు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఉద్రిక్తత నెలకొంది.

రజకుల చెరువు స్వాధీనంపై ఉద్రిక్తత
రజకసంఘం నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

 అడ్డుకున్న సంఘ నాయకులు 

 నెట్టివేసిన పోలీసులు

కైకలూరు, జూలై 31 : కైకలూరులో రజకుల చెరువు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఉద్రిక్తత నెలకొంది. కైకలూరు యూపీ స్కూల్‌ వెనుక ఉన్న రజకుల చెరువు భూమిని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేయాలని  శనివారం భావించారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ చెరువును రజకుల చెరువుగా వినియోగిస్తున్నామని, గతంలో రజకుల కమ్యూనిటీ హాలుకు కొంత, దోబీఘాట్‌కు కొంత భూమిని కేటాయిస్తూ పంచాయతీ తీర్మానం చేసిందని రజక సంఘ నాయకులు అన్నారు. ఇప్పుడు అధికారులు రైతుభరోసా కేంద్రం, సచివాలయం-2, వెల్‌నెస్‌, పాలకేంద్రం భవనాల నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయటం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ భూమిని మెరక చేసేందుకు తహసీల్దార్‌ ఐ.సాయికృష్ణకుమారి, పంచాయతీ సర్పంచ్‌ డి.ఎం.నవరత్నకుమారి, కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ ప్రయత్నించారు. దాంతో రజక సంఘం నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు సహకారంతో మెరక పనులు నిర్వహించారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. రజకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘ నాయకులను  పక్కకు నెట్టివేశారు. కోర్టులో దాఖలు చేశామని అయినా అధికారులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళవెంకటరమణ సంఘటనా స్ధలానికి చేరుకుని అధికారులు, రజక సంఘ నాయకులతో మాట్లాడుతూ వారికి కేటాయించిన భూమిని కబ్జాచేయడం దారుణమన్నారు. రాష్ట్రచాకిరేవు రజక సంఘం అధ్యక్షుడు గొల్లపూడి పార్థసారథి, ఉపాధ్యక్షుడు తారాసు శివప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి అవనిగడ్డ రాము, కైకలూరు చేరుకుని రజక సంఘం ఆధ్వర్యంలో అధికారులతో చర్చించారు. అయినా ఫలితం లేకపోవటంతో  న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు.


Updated Date - 2021-08-01T06:10:25+05:30 IST