Abn logo
Oct 3 2020 @ 15:15PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌పై అప్పుడే ఓ ఆలోచన వస్తుంది : రాజమౌళి

Kaakateeya

వరుస సూపర్‌హిట్‌ మూవీస్‌తో ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈ అగ్ర దర్శకుడు ఇప్పుడు మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ మూవీ 'రౌద్రం రణం రుధిరం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్‌ దేవగణ్‌, అలియా భట్‌, హాలీవుడ్ స్టార్స్‌ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో  సినిమా పరిశ్రమ గురించి, భవిష్యత్‌లో సినిమా పరిశ్రమ ఎలా ఉండబోతుందనే విషయాల గురించి రాజమౌళి మాట్లాడారు. 


ఆరోగ్యం ఎలా ఉందండి...?

- బావుందండి.. అంతా సెట్ అయిపోయింది

లాక్‌డౌన్‌ తర్వాత బయటకు టూర్‌ వెళ్లారు కదా!

- చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాం కదా, కాబట్టి నేను, రమ సరదాగా బయటకు వెళదామని అనుకున్నాం. బందీపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాం.  పుట్టిన రాష్ట్రంలోకి వెళ్లడం ఓ మంచి ఫీలింగ్‌ ఇచ్చింది. 

ప్లాస్మా డొనేషన్‌కు మీకు అవకాశం రాలేదుగా?

- మన శరీరంలో కరోనా వచ్చిన రేంజ్‌ను బట్టి యాంటీ బాడీస్‌ డెవలప్‌ అవుతాయి. నాకు చాలా తక్కువ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఆ కారణం, మరేదో కానీ నాకు యాంటీ బాడీస్‌ అనుకున్న స్థాయిలో డెవలప్‌ కాలేదు. యాంటీ బాడీస్‌ 15 పాయింట్స్‌కు రీచ్‌ కావాలి. కానీ నాకు 8 నుండి 10 పాయింట్లే డెవలప్‌ అయ్యింది. పెద్దన్న, కాలబైరవకి యాంటీ బాడీస్‌ బాగా డెవలప్‌ కావడంతో వాళ్లు ప్లాస్మాను డొనేట్‌ చేశారు. 

50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందిగా, ఇది వర్కవుట్‌ అవుతుందని అనుకుంటున్నారా?

- తెలియడం లేదు.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెన్‌ చేయడం కరెక్ట్‌ కాదని నేను అనుకుంటున్నాను. విమానాల్లో రెండు, మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. అక్కడతో పోల్చితే థియేటర్స్లోనే సీట్లు మధ్య ఎక్కవ గ్యాప్‌ ఉంటుంది. మరి అలాంటప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెన్‌ చేయడం కరెక్ట్‌ కాదేమోనని అనుకుంటున్నాను. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుని ఉండి, ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. టెంపరరీగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసకోవడానికి ఈ ప్రయత్నం చేసుండొచ్చు. 

'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యిందా? ప్లానింగ్‌ ఎలా ఉండొచ్చు?

- హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేయాలని అనుకుంటున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ ఎలా చేయాలనే దానిపై మేం చాలా హోం వర్క్‌ చేశాం. ఎవరు ఎలా షూటింగ్‌కు రావాలనే దాని గురించి ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. 

షూటింగ్‌, ప్రీ వర్క్‌ ప్రెజర్‌ పెంచుతుందా?

- ప్రెజర్‌ ఏం లేదు. ప్రతి సినిమా చేసే సమయంలో చాలా సమస్యలుంటాయి. కరోనా సమయంలో అవి ఇంకా కాస్త ఎక్కువగా ఉంటాయి. దాని కోసం తలలు కొట్టేసుకోవాల్సిన పనేం లేదు. పనిలో పడి ఎక్కడా జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతామనే దానిపై ఆలోచించి గైడ్‌లైన్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అందరూ పాటిస్తూ ఎలా ముందుకు పోవాలనేది చూడాలి. మేం షూటింగ్ ఎలా చేస్తామనే దాన్ని అందరూ గమనిస్తారు కాబట్టి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది. క్రూని తగ్గించే చేస్తాం. చేసే సమయంలో కొన్ని ప్రాక్టికల్‌ ప్రాబ్లెమ్స్‌ వస్తాయి. వాటిని సాల్వ్‌ చేసుకుంటూ ముందుకెళ్లాం. 

కరోనా వైరస్‌ గురించి జనాల్లో భయం తగ్గిందని అనుకుంటున్నారా?

- ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంది. రీసెంట్‌గా మేం కర్ణాటక వెళ్లినప్పుడు చాలా మంది మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. నార్మల్‌గానే ఉన్నారు. అదే నల్గొండకు వెళ్లినప్పుడు 90 శాతం మంది మాస్కులు వేసుకుని ఉన్నారు. జనాలు పనిలోకి వెళ్లడానికి భయపడుతున్నారు కానీ.. అటు ఇటు తిరగడానికి భయపడటం లేదు. విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. అన్నీ ఇండస్ట్రీలను ఓపెన్‌ చేసినట్లు సినిమా ఇండస్ట్రీని ఓపెన్‌ చేస్తే సమస్య ఏమీ ఉండదు. అదే సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూసినప్పుడు, సినిమా థియేటర్‌కు వెళితే ఆడినషనల్‌ డేంజరా అనే ఆలోచన ప్రజలకు కలుగుతుంది. ఎక్కడపడితే అక్కడ, మాస్కులు ధరించకుండా తిరిగినప్పుడు లేని ప్రమాదం సినిమా థియేటర్‌కు వెళ్లినప్పుడు వస్తుందని అనుకోవడం లేదు. ఇతర దేశాలతో ఇండియాను పోల్చలేం. ఇతర దేశాల్లో ఎంటర్‌టైనింగ్‌ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఉన్న కార్యక్రమాల్లో సినిమా అనేది ముఖ్యం. జనాలు ఎదురుచూసే సినిమాతో థియేటర్స్‌ రన్ అయితే క్రమంగా అందరం ముందుకెళతాం.  

నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ పునరాలోచించాలనే చర్చ జరుగుతుంది?

- ప్రతి ప్రాజెక్ట్‌ను ఒకేలా చూడలేం. నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎవరైనా ఇలాగే చేస్తామని మంకు పట్టు పట్టుకుని కూర్చోలేరు. ఆ ప్రాజెక్ట్‌ ముందుకెళ్లడానికి ఏం చేయాలో అందరూ అది చేస్తారు. అదేం భయంకరమైన సిట్చ్యువేషన్‌ మాత్రం కాదు. చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.

చెర్రీ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చారుగా.. తారక్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఎప్పుడిస్తారు?

-  చాలా త్వరలోనే ఉంటుంది. అనౌన్స్‌మెంట్‌ చేస్తాం. 

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత విమర్శలు ఎదుర్కొన్న ఆలియా భట్‌ ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో నటిస్తుంది కదా.. ఈ సినిమాలో నటించడం వల్ల ఆమె ఆ ఫేజ్‌ నుండి బయటకు వస్తుందని అనుకుంటున్నారా?

- నాకు సుశాంత్‌కు సంబంధించిన న్యూస్‌లో జనరల్‌ ఐడియా ఉందే తప్ప.. అదేపనిగా ఫాలో కావడం లేదు. ఆలియాభట్‌ ఫెంటాస్టిక్‌ పెర్ఫామర్‌. మా సినిమాలో చేయాల్సిన పాత్రకు తను వందశాతం సూట్‌ అవుతుంది. అందుకనే ఆమెను అప్రోచ్‌ అయ్యాం. తను ఎగ్జైట్‌ అయ్యి ఈ సినిమాలో యాక్ట్‌ చేయడానికి ఓకే చెప్పింది. తన పర్సనల్ లైఫ్‌లో ఏదో జరుగుతుంది కదా.. అది నా సినిమాపై ఎఫెక్ట్‌ చూపుతుందని అనుకోవడం లేదు. థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుందిగా, దాన్ని బేస్‌ చేసుకుని సినిమా చూడాలని అనుకోడు.  

లాక్‌డౌన్‌ సమయంలో దక్షిణాది సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియా సినిమాలుగా మారుతున్నాయిగా, ఏంజరిగి ఉండొచ్చు?

- మన సినిమాకు ప్యాన్‌ ఇండియా మూవీ అయ్యే అవకాశం ఉందని చాలా మందికి బాహుబలి నుండి వచ్చింది. చాలా రోజుల పాటు ఓ పర్టికులర్‌ సినిమాలకే  పరిమితమయ్యారు. ఎప్పుడైతే తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాలు హిందీలోకి అనువాదమై వాటిని చూడటం మొదలు పెట్టారో, తెలియకుండా అందరికీ సౌత్‌ సినిమాల్లో మనకు నచ్చే సినిమాలున్నాయనే ఆడియెన్స్‌ పెద్ద సంఖ్యలో తయారయ్యారు. బాహుబలి సక్సెస్‌ తర్వాత అదింకా పెరిగింది. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ మనం చేస్తున్న సినిమా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యే అవకాశం ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంకేం చేస్తే అది వస్తుందనే ఆలోచన వచ్చింది. అలాగే లాక్‌డౌన్‌లో ఓటీటీల్లో ఇతర భాషల సినిమాలు చూసి, అరే ఇంత మంచి సినిమాలు వస్తున్నాయా అని ఆలోచించి సినిమాలు చూశారు. అలా ఆడియెన్స్ ఆలోచనలు మారుతూ వచ్చాయి. అలా సౌతిండియా మేకర్స్‌ ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశాలు పెరిగాయి. 

కేజీయఫ్ సినిమా చూసిన మీరు, వారికి సాయం చేశారని మేకర్స్‌ అంటున్నారు. ఆసినిమాలో మిమ్మల్ని అంతలా ప్రభావం చూపిన అంశాలేంటి?

- నేను కేజీయఫ్‌  యూనిట్‌కు పెద్ద సాయమేమీ చేయలేదు. చాలా చిన్నమాట సాయం చేశాను. నేను ఓ సారి కర్ణాటక వెళ్లినప్పుడు నా పక్క రూమ్‌లోనే ఉన్న యష్‌ నన్ను కలిసి కేజీయఫ్‌ సినిమా గురించి చెప్పి మూడు నిమిషాల విజువల్స్‌ చూపించాడు. చూడగానే నాకు అది అందరికీ నచ్చే సినిమా అవుతుందనిపించి నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్‌ ఇక శోభుగారికి, బాలీవుడ్‌లో అనీల్‌ టడానీకు ఫోన్‌ చేసి చెప్పాను. వారికి నచ్చడంతో వాళ్లు రిలీజ్‌ చేశారు. 

'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ ఎప్పుడు ఉండొచ్చు?

- కరోనా ముందైతే నేను డేట్‌ చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం. కొన్ని పద్ధతుల్లో షూటింగ్‌ చేయాల్సి ఉంది. అలా చేస్తున్నప్పుడు అనుకున్న సమయంలోనే షూటింగ్‌ చేస్తున్నానా!, అని చూసుకోవాలి. ప్రాక్టికల్‌ సమస్యలేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్‌ ప్లాన్‌ చేసుకున్నాం. ఆ రెండు నెలలు షూటింగ్‌ అనుకున్నట్లు జరుగుతుందా అని చూసుకోవాలి. తర్వాతే రిలీజ్‌ డేట్‌పై అవగాహన కలుగుతుంది. 

లాక్‌డౌన్‌ సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఏమైనా జరిగిందా?

- కొంత వరకు జరిగింది. వి.ఎఫ్‌.ఎక్స్‌ స్టూడియోస్ అన్నీ మూసి వేశారు. పెద్ద వర్క్‌ చేయడానికి అవకాశం లేకుండా పోయాయి. 

ఓటీటీల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

- ఓ సినిమా చేస్తున్నాం.  దాన్ని థియేటర్స్‌, ఛానెల్స్‌, ఓటీటీల్లో విడుదల చేస్తాం. ఈ మూడింటిలో ఓటీటీ చాలా ఫాస్ట్‌గా డెవలప్‌ అవుతున్న మాధ్యమం. అది మేకర్స్‌ అడ్వాంటేజ్‌ అవుతుందనడంలో సందేహం లేదు. సాధారణంగా సినిమా థియేటర్‌లో విడుదలైతే ఎంత వసూళ్లు సాధించాయనే దాన్ని బట్టి ఓ అంచనాకు వస్తాం. శాటిలైట్‌ ఛానెల్‌లో సినిమా విడుదలైతే ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నారు. టీఆర్‌పీ ఎంత వచ్చిందనేది తెలుస్తుంది. కానీ ఓటీటీలో సినిమా విడుదలైతే అవేమీ తెలియదు. అలాగని ఓటీటీ తక్కువని కాదు. ఎక్కువ కథలను చెప్పే ఓ మాధ్యమం మనకు దొరికింది. కొత్త టాలెంట్‌ బయటకు వస్తుంది. 

మీ ట్రిపుల్‌ ఆర్‌ 1000 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రతి సినిమాకు అంచనాలను మించిపోతున్నారు. ఎలా?

- ప్రతి ఒక్కరికీ వారి సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ రావాలని ఉంటుంది. నేనూ అలా ఆలోచిస్తాను.  అయితే అది సినిమా చేయడానికి నన్ను ఇన్‌స్పైర్‌ చేయదు. అలా ఆలోచించను. ఓ కథను  చెప్పడానికి నేను ఎంత ఎగ్జయిట్‌ అవుతాననేదే ముఖ్యం. 

ప్రభాస్‌ వరుస ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారుగా.. మీకేమనిపిస్తుంది?

ఆయనకు వేరే దారిలేదు(నవ్వుతూ).. అంత ఫ్యాన్‌డమ్ పెరిగిన తర్వాత కొందరికే నచ్చే సినిమాలు చేస్తాననుకోలేడు. తను లాక్‌ అయిపోయాడు. 

'ఆదిపురుష్‌' గురించి మీతో ప్రభాస్‌ డిస్కస్‌ చేశారా?

- చేశాడు.. కానీ ఆ సినిమా గురించి నేను ఏమీ చెప్పలేను. 

లాక్‌డౌన్‌లో వెబ్‌సిరీస్‌లు చూశారా?

- చాలా వెబ్‌ సిరీస్‌లను చూశాను. కొన్ని నచ్చాయి. కొన్ని బోర్‌ కొట్టాయి. అయితే రెండు నెలలుగా చూడటం తగ్గించేశాను. ఎందుకంటే సినిమా స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం కాబట్టి సమయం లేదు. సినిమాపై వర్క్‌ చేస్తున్నాను. ప్రస్తుతం మంక్‌ అనే పాత సిరీస్‌ను రాత్రిపూట ఓ ఎపిసోడ్‌ చూస్తున్నాను. 

భవిష్యత్తులో ఫిలిం అకాడమీ స్టార్ట్‌ చేసే ఆలోచన ఉందా?

- అస్సలు లేదు. టీచింగ్‌ అనే పూర్తిగా వేరు. నాకు అది తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాననుకోండి.  ఉదాహరణకు ఈగ సినిమా రెండేళ్లు చేశాను. ఈ సమయంలో చాలా మంది వి.ఎఫ్‌.ఎక్స్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు.  వారందరూ మేం ఇచ్చే సమస్యలు దాటి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చేలా రూపొందారు. ఈ ప్రయాణమే ఓ టీచింగ్‌. పనిచేస్తూ, నేర్చుకోవడం గురించే నాకు తెలుసు. అంతే తప్ప, ఓ స్కూల్‌ పెట్టి థియరీ, ప్రాక్టికల్స్ చెప్పలేను. నేను బ్యాడ్‌ టీచర్‌ని. 

మహేశ్‌బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు?

- ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. అది ముందు నుండి నాకు అలవాటు. ఇప్పుడు కూడా అంతే. ట్రిపుల్‌ ఆర్‌ పూర్తయితే కానీ, మహేశ్‌ సినిమా గురించి ఆలోచించను. అంత మైండ్‌ స్పేస్‌ ఉండదు. 

మహాభారతం సినిమా గురించి ఆలోచించారా?

- మహాభారతం నా మైండ్‌లో ఎప్పుడూ రన్‌ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఓ క్యారెక్టర్‌ వచ్చిందంటే ఎలా  చేయాలని ఆలోచిస్తాను. అలాగే ఓ సీన్‌ వస్తే ఎలా చేయాలని ఆలోచిస్తుంటాను. నేను ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలనుండి కొత్త విషయాలు నేర్చుకుని మా అంబుల పొదిలో ఓ బాణాన్ని చేర్చుకుంటున్నాను. అవన్నీ మహాభారతాన్ని చేయడానికి ఉపయోగించుకుంటాను. 

మహాభారతంలో మీకు నచ్చిన పాత్ర ఏంటి?

- కర్ణుడు

సాధారణ పరిస్థితులు ఎప్పుడు రావచ్చు?

- దాని గురించి ఇప్పుడు ఆలోచించకపోవడమే బెటర్‌. ఎందుకంటే సాధారణ పరిస్థితులు ఎప్పుడొచ్చినా మార్చి ముందు ఉండే పరిస్థితులైతే రావు. కొత్త సాధారణ పరిస్థితులు, న్యూ ఫేజ్‌ ఆఫ్‌ లైఫ్‌ వస్తుంది. దానికి అలవాటు పడాలంతే. 


Advertisement
Advertisement