Abn logo
Feb 22 2020 @ 20:10PM

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన రజినీకాంత్

చెన్నై: తూత్కుకుడి హింస కేసులో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఏకసభ్య కమిషన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ విజ్ఞప్తి చేశారు. వేదాంత స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్‌కు వ్యతిరేకంగా 2018 మేలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 13 మంది మరణించారు. ఈ కేసులో కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చేందుకు ఈనెల 25న హాజరుకావాలని రజినీకాంత్‌కు మద్రాసు హైకోర్టు రిటైర్ట్ జడ్జి అరుణ జగదీషన్ సమన్లు జారీ చేశారు. దీనిపై రజినీకాంత్ తరఫు న్యాయవాది ఒక అఫిడవిట్‌లో తన క్లయింట్‌ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఏకసభ్య కమిషన్‌ను కోరారు.


వ్యక్తిగతంగా తన క్లయింట్ హాజరు కావడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, తన క్లయింట్‌ను అడగదలచిన ప్రశ్నలు తెలియజేస్తే వాటికి రజినీకాంత్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈనెల మొదట్లో జస్టిస్ అరుణా జగదీషన్ వ్యక్తిగతంగా తన ముందు హాజరుకావాలని రజినీకాంత్‌కు సమన్లు జారీ చేశారు. రజినీ సైతం కమిషన్‌కు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.


నాటి ఘటన...

2018 మేలో సుమారు 20,000 మంది నిరసనకారులు కాలుష్యకారక కాపర్ యూనిట్‌ను మూసివేయాలంటూ హింసాత్మక ఆందోళనలకు దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం గురించి తనకు తెలుసంటూ ఆ సమయంలో రజినీకాంత్ పేర్కొన్నారు. దీంతో ఆయనకు తెలిసిన విషయాలు చెప్పేందుకు తమ ముందు హాజరుకావాలని ఏకసభ్య కమిషన్ రజినీకాంత్‌కు సమన్లు ఇచ్చింది.


తూత్కుకుడి హింసాకాండలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అప్పట్లో రజినీకాంత్ కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటన వెనుక సంఘవ్యతిరేక శక్తులన్నాయంటూ చెన్నై విమానాశ్రయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. 'నాకు ఎలా తెలుసునని అడక్కండి, నాకంతా తెలుసు' అని రజినీకాంత్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement