Abn logo
Oct 14 2021 @ 21:53PM

రాజరాజేశ్వరి అలంకారంలో చెంగాళమ్మ

మహిషాసురమర్ధిని అలంకరణలో దర్శనమిస్తున్న మూకాంబికాదేవి

సూళ్లూరుపేట, అక్టోబరు 14 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సూళ్లూరుపేట చెంగాళమ్మను రాజరాజేశ్వరిగా అలంకరించారు. నెల్లూరుకు చెందిన ముద్దలూరు మురళీకృష్ణమరాజు - అనిత దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ యాగశాలలో చండీయాగం నిర్వహించారు. సూళ్లూరుపేటకు చెందిన ఆక్రంబాకం దొరబాబురెడ్డి - సుహాసిని దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. 

నాగేశ్వరస్వామి ఆలయంలో..

సూళ్లూరుపేట నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీదేవిని విజయలక్ష్మిగా అలంకరించారు. సహస్ర నామార్చన దేవీ ఖడ్గమాల పఠన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్‌ నలుబోయిన రాజసులోచనమ్మ, సభ్యులు, ఉభయకర్తలు పాల్గొన్నారు. 

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ..

కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం మూలవిరాట్‌ను కొల్హాపురి మహాలక్ష్మిగా అలంకరించారు. అద్దంకి నాగేశ్వరరావు ఉభయకర్తగా పాల్గొన్నారు. ఉత్సవమూర్తిని బాల త్రిపుర సుందరిగా అలంకరించారు. పోలేటి సుబ్రహ్మణ్యంశెట్టి సోదరులు, పచ్చిపులుసు సురేష్‌కుమార్‌, తెగు రమణయ్య, తెగు తిరుపతిరావు ఉభయకర్తలుగా పాల్గొన్నారు.  కన్యకాపరమేశ్వరి ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు కాకి శ్రీరామమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. 

మహిషాసురమర్దిని అలంకరణలో మూకాంబిక 

నాయుడుపేట టౌన్‌ : పట్టణంలోని మూకాంబిక ఆలయంలో అమ్మవారు  మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పట్టణంలోని అన్ని అమ్మవారి ఆలయాలలో మహిళలు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. 

శ్యామలాదేవి అలంకారంలో గ్రామదేవత కోటమ్మ 

కోట : కోట గ్రామదేవత కోటమ్మ శ్యామలాదేవి అలంకారంలో, విద్యానగర్‌లో మహాలక్ష్మి , గూడలిలోని రామలింగచాముండేశ్వరి మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడలిలో  బిందెకలశం  ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆశం శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 

గూడూరు: గూడూరులోని సాయిసత్సంగ నిలయంలో విజయదుర్గాదేవి, నారాయణమ్మ, గంగమ్మ, రాజరాజేశ్వరి  ఆలయాల్లో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో, శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి చాముండేశ్వరిగా, ధర్మరాజులస్వామి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా,  బజారు కలిశం వద్ద అమ్మవారు విజయలక్ష్మిగా పూజలందుకున్నారు.

రాపూరు:  కోనలో ఆదిలక్ష్మి ధనలక్ష్మి అలంకారంలో, కన్యకాపరమేశ్వరి, పోతుకొండ అంకమ్మ, పర్వతవర్ధిని అమ్మవారు మహిషాసురమర్థిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లుకు విశేష పూజలు నిర్వహించారు. 

చిల్లకూరు: తూర్పుకనుపూరు గ్రామంలోని ముత్యాలమ్మ మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఉభయదాతలుగా ముమ్మారెడ్డి గోపాల్‌రెడ్డి వ్యవహరించారు.