ఆల్వార్ కేసును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదు : అశోక్ గెహ్లాట్

ABN , First Publish Date - 2022-01-16T22:34:23+05:30 IST

రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జనవరి 11న ఓ మైనర్ బాలికపై జరిగిన

ఆల్వార్ కేసును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదు : అశోక్ గెహ్లాట్

జైపూర్ : రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జనవరి 11న ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐ లేదా ఏదైనా ఇతర సంస్థకు అప్పగించేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఈ కేసుపై రాజస్థాన్ పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నారని, దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 


అత్యాచారం జరిగినపుడు దాని గురించి మాట్లాడటం వల్ల బాధితురాలి కుటుంబ సభ్యులు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారనే విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆల్వార్ కేసును వాడుకుంటూ, వికారమైన ప్రచారం చేస్తోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగిన అంశమని చెప్పారు. రాష్ట్ర పోలీసులు ఈ కేసుపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 


వాస్తవం బయటపడే విధంగా స్వతంత్ర దర్యాప్తు జరగాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. బాధితురాలి బంధువులు ఈ కేసుపై దర్యాప్తు ఓ ప్రత్యేక అధికారి, సీఐడీ, క్రైమ్ బ్రాంచ్, లేదా సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా జరగాలని కోరుకుంటే, ఆ విధంగా దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 


ఇదిలావుండగా, బాధితురాలి సోదరి మీడియాతో మాట్లాడుతూ, ఆల్వార్ పోలీసు సూపరింటెండెంట్ మాట మార్చారని ఆరోపించారు. మొదట్లో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పారని, ఇప్పుడు అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని అంటున్నారని తెలిపారు. పోలీసుల మాట ఎందుకు మారిందని ప్రశ్నించారు. 


రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఓ వంతెన క్రింద జనవరి 11న మానసిక అస్వస్థురాలైన మైనర్ బాలిక రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించారు. ఆమె తీవ్రంగా గాయపడి ఉండటం గమనించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె మర్మాంగాల వద్ద గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు. 


Updated Date - 2022-01-16T22:34:23+05:30 IST