కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అశోక్‌ గెహ్లోత్‌?

ABN , First Publish Date - 2022-08-25T09:42:02+05:30 IST

కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఎంపిక కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు, అపార రాజకీయానుభవం ఉన్న ఆయన వైపే పార్టీ తాత్కాలిక

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అశోక్‌ గెహ్లోత్‌?

రాజస్థాన్‌ సీఎం వైపే సోనియా మొగ్గు!

10-జన్‌పథ్‌లో మొన్న భేటీ పార్టీ పగ్గాలు చేపట్టాలని సూచన

ఆ వెంటనే రాహుల్‌, ప్రియాంకతో కలిసి విదేశాలకు పయనం

సారథ్యానికి గెహ్లోత్‌ విముఖత సీఎం పదవి వదులుకోవడానికి నో

అసెంబ్లీ ఎన్నికల్లో తానే పార్టీని నడిపించాలని అభిలాష

ఆయన కాదంటే రేసులో సోనీ, ఖర్గే, వేణుగోపాల్‌, వాస్నిక్‌!

28న సీడబ్ల్యూసీ సమావేశం అధ్యక్ష ఎన్నిక తేదీ ఖరారు


న్యూఢిల్లీ, ఆగస్టు 24: కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఎంపిక కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు, అపార రాజకీయానుభవం ఉన్న ఆయన వైపే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. 2019లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ.. మరోసారి ఆ పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అంటుండడం.. ప్రియాంకాగాంధీ వాధ్రా కూడా అంగీకరించకపోవడంతో పార్టీలో నాయకత్వ సంక్షోభం ముదిరింది. ఈ పరిస్థితుల్లో గెహ్లోత్‌ బాధ్యతలు చేపడితే పాత, కొత్తతరం నేతలకు అభ్యంతరం ఉండదని.. అన్ని వర్గాలనూ ఆయన కలుపుకొని పోగలరని సోనియా భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన్ను జైపూర్‌ నుంచి ఢిల్లీ పిలిపించి 10-జన్‌పథ్‌లో చర్చించారు. పార్టీ పగ్గాలు స్వీకరించాలని ఆయనకు సూచించారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోపే రాహుల్‌, ప్రియాంకలతో కలిసి ఆమె విదేశాలకు పయనమయ్యారు.


ఇంకోవైపు.. సీడబ్ల్యూసీ ఆదివారం (28న) సమావేశం కానుంది. అధ్యక్ష ఎన్నికల తేదీని ఈ సందర్భంగా ఖరారు చేయనుంది. గహ్లోత్‌ పేరు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా.. సీఎం పదవి వదిలిపెట్టి పార్టీ సారథ్యం చేపట్టడానికి ఆయన సుముఖంగా లేరు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పార్టీని నడిపించాలని ఆయన అభిలషిస్తున్నారు. అదీగాక తాను అక్కడి నుంచి కదలాల్సి వస్తే సీఎం పీఠమెక్కేందుకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ సిద్ధంగా ఉన్నారు. సోనియాతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహులే తమ నాయకుడని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బంతి గహ్లోత్‌ కోర్టులోనే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గాంధీయేతరులు కాంగ్రె్‌సను నడపడం అంత తేలిక కాదని, సొంత పంథా పాటించడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని ఆయనకూ తెలుసు.


గహ్లోత్‌ అంగీకరించకపోతే.. అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న సీనియర్‌ నేతలు అంబికా సోనీ, మల్లికార్జున్‌ ఖర్గే,  మీరాకుమార్‌, కేసీ వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌ పేర్లు కూడా వినవస్తున్నాయి. ‘జీ హుజూర్‌’ అనేవారిని మాత్రమే ఆ పదవికి ‘ఎంపిక’ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా సోనియా విదేశాలకు వెళ్తే రాహుల్‌, ప్రియాంకల్లో ఎవరో ఒకరే ఆమె వెంట వెళ్లేవారని.. ఇప్పుడు ఇద్దరినీ వెంట తీసుకెళ్లడంతో.. ప్రియాంక కూడా ఈ పోస్టుపై సుముఖంగా లేరని అర్థమవుతోందని.. పార్టీ సీనియర్‌ నేతలే కొత్త అధ్యక్షుడిపై ఓ నిర్ణయానికి రావాలన్నది సోనియా ఉద్దేశంగా కనబడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ప్రస్తుతానికి స్టేటస్‌ కో?

పలు సార్లు సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసిన వర్కింగ్‌ కమిటీ.. జి-23 నేతల ఒత్తిడితో సెప్టెంబరు 20లోపు అధ్యక్ష ఎన్నిక జరపాలని ఇదివరకే నిర్ణయించింది.  దీనిని ఇంకా పొడిగించకపోవచ్చని అంటున్నారు. అయితే స్టేటస్‌ కో (యథాతథ స్థితి)ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంటే సోనియానే మరికొంత కాలం ఆ పదవిలో ఉండేలా చేయడమన్న మాట.


కాంగ్రెస్‌ మార్పులు జరగాల్సిందే! 

కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజకీయ స్థానాన్ని కోల్పోయిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, జి-23 గ్రూపు ప్రముఖుడు ఆనంద్‌ శర్మ వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గత మార్పులు అత్యవసరమన్నారు. వర్గాలు లేకుండా ఉంటేనే  పునరుజ్జీవం సాధ్యమని స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆనంద్‌ శర్మను కాంగ్రెస్‌ అధిష్ఠానం పక్కనపెట్టింది. ఈ నెల 7న ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు.


కాంగ్రె్‌సకు జైవీర్‌ షెర్గిల్‌ రాజీనామా

కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. పార్టీలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం లేదని, క్షేత్ర స్థాయి వాస్తవాలను పట్టించుకోవడం లేదని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. పార్టీలో ముఖస్తుతి అధికమయిందని తెలిపారు. 

Updated Date - 2022-08-25T09:42:02+05:30 IST