డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసిన రాజస్థాన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-06T03:36:06+05:30 IST

దేశంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో...

డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసిన రాజస్థాన్ ప్రభుత్వం

జైపూర్: దేశంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నిర్వహించాల్సి ఉన్న డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని యూనివర్సిటీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


ఆదివారం గెహ్లట్ నివాసంలో విద్యా శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు, టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని గెహ్లట్ చెప్పారు.


విద్యాశాఖ త్వరలో విడుదల చేయబోయే మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నట్లు తెలిపారు. జూలై 15 నుంచి ఆగస్ట్ 18 వరకూ యూజీ, పీజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాజస్థాన్ యూనివర్సిటీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే సీఎం ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాజస్థాన్‌లో ఆదివారం కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు, ఆరు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని భావించిన సీఎం అశోక్ గెహ్లట్ పరీక్షల రద్దుకే మొగ్గు చూపారు.



Updated Date - 2020-07-06T03:36:06+05:30 IST