Omicron వ్యాప్తితో ర్యాలీలు, జాతరలు, వివాహాలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2022-01-03T18:20:05+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో పెరుగుతున్న ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్యతో రాష్ట్రప్రభుత్వం సోమవారం పలు ఆంక్షలు విధించింది....

Omicron వ్యాప్తితో ర్యాలీలు, జాతరలు, వివాహాలపై ఆంక్షలు

రాజస్థాన్ సర్కారు తాజా మార్గదర్శకాల జారీ

జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో పెరుగుతున్న ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్యతో రాష్ట్రప్రభుత్వం సోమవారం పలు ఆంక్షలు విధించింది. ఒమైక్రాన్ కట్టడి కోసం ర్యాలీలు,ధర్నాలు, జాతరలు, వివాహాలకు హాజరు అయ్యే వారి సంఖ్యను 100 మందికే పరిమితం చేస్తూ రాజస్థాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జైపూర్ నగరంలో 1 నుంచి 8వతరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది. జైపూర్‌లో రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన కొవిడ్ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఆంక్షలను జనవరి 7 వతేదీ ఉదయం 5 గంటల నుంచి అమలు చేయనున్నారు.ఈవెంట్లను నిర్వహించే ముందు దీని సమాచారాన్ని వెబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని అధికారులు సూచించారు.


విదేశాల నుంచి రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, 7 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని రాజస్థాన్ అధికారులు సూచించారు.రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చే దేశీయ విమాన ప్రయాణికులు కూడా డబుల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల కంటే ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ టెస్ట్ రిపోర్టును సమర్పించాలని మార్గదర్శకాల్లో చేర్చారు.జైపూర్ గ్రేటర్, జైపూర్ హెరిటేజ్ మునిసిపల్ కార్పొరేషన్లలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సెలవు ప్రకటించారు.


ఇతర జిల్లాల్లో విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శితో చర్చించిన తర్వాతే పాఠశాలలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను 20కి పరిమితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31లోగా ఉద్యోగులందరికీ రెట్టింపు టీకాలు వేయాలని ప్రభుత్వం అన్ని వాణిజ్య సంస్థలను ఆదేశించింది.రాజస్థాన్ రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.రాజస్థాన్‌లో ఆదివారం 355 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి, అందులో జైపూర్‌లో మాత్రమే 224 కేసులు వెలుగుచూశాయి.


Updated Date - 2022-01-03T18:20:05+05:30 IST