Rajasthan Political Crisis: దెబ్బకు దారిలోకొచ్చిన గెహ్లాట్.. అధిష్టానమా.. మజాకా!

ABN , First Publish Date - 2022-09-28T03:16:50+05:30 IST

జైపూర్: రాజస్థాన్‌లో పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేయడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ...

Rajasthan Political Crisis: దెబ్బకు దారిలోకొచ్చిన గెహ్లాట్.. అధిష్టానమా.. మజాకా!

జైపూర్: రాజస్థాన్‌లో పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేయడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు అసమ్మతి స్వరం వినిపించిన ఆయన మద్దతుదారులంతా దారిలోకొచ్చేశారు. జైపూర్‌కు కాంగ్రెస్ పరిశీలకులుగా వెళ్లిన అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి తిరిగివచ్చి 9 పేజీల నివేదికను అధిష్టానానికి అందజేశారు. శాంతి ధరీవాల్, ధర్మేంద్ర రాథోడ్, మహేశ్ జోషి తదితరులపై వేటెయ్యాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజా పరిణామాలపై కన్నెర్ర చేశారని, అసమ్మతి నాయకులపై వేటు తప్పదని వార్తలు రావడంతో అంతా దారిలోకొచ్చారు. తన సీఎం పదవికి కూడా ఎసరు వస్తోందని తెలియడంతో అశోక్ గెహ్లాట్ అసమ్మతి ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరిపారు. విడతలవారీగా వారితో చర్చలు జరిపి అధిష్టానం చెప్పినట్లు నడచుకోవాలని సూచించారు. దీంతో అంతా సరేనన్నారు. అసమ్మతి నేతలంతా దారిలోకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖుషీగా ఉందని సమాచారం. 




అంతకు ముందు అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అందరికంటే ముందున్న అశోక్ గెహ్లాట్‌ తాను ఢిల్లీ వెళ్లిపోయినా రాజస్థాన్‌పై తన పట్టుండాలని కోరుకున్నారు. దీంతో తన వర్గీయుడినే సీఎం చేయాలని అధిష్టానానికి షరతులు పెట్టారు. గెహ్లాట్ మద్దతుదారులైన 93 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషికి అందజేశారు. అంతేకాదు తాము చెప్పినవారినే సీఎం చేయాలని సచిన్ పైలట్‌ను మాత్రం చేయవద్దని వారంటున్నారు. నిజానికి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించింది. అయితే అందరి సమ్మతితో చేయాలని కోరుకుంది. అందుకే అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గేను పరిశీలకులుగా జైపూర్ పంపింది. కానీ ఎమ్మెల్యేలెవ్వరూ వారిని కలవలేదు. పైగా సచిన్ పైలట్ వద్దే వద్దంటూ వారు హోటళ్లకు పరిమితమయ్యారు. ఈ తరుణంలో తాను కూడా ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వచ్చేసింది. పరిశీలకులుగా పంపిన అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గేను ఢిల్లీ రావాలని కోరింది. ఢిల్లీ వచ్చిన ఖర్గే, మాకెన్ జరిగిందంతా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందే అశోక్ గెహ్లాట్ వేసిన ఎత్తులు అధిష్టానానికి సహజంగానే కోపం తెప్పించాయి. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ కాకుండా ఇతర పేర్లను పరిశీలించడం మొదలుపెట్టింది. కమల్‌నాథ్‌ను ఇప్పటికే  ఢిల్లీకి పిలిచారు. శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దిగ్విజయ్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. 


మరోవైపు సచిన్ పైలట్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల్లో భాగంగా సోనియా, అజయ్ మాకెన్‌, మల్లికార్జున ఖర్గేతో పైలట్ చర్చలు జరపనున్నారు. విధేయంగా ఉన్న పైలట్‌ను సీఎం చేయడం కోసం అశోక్ గెహ్లాట్ వర్గీయులను దారిలోకి తెచ్చుకునే యత్నాలు కాంగ్రెస్ అధిష్టానం ముమ్మరం చేసింది. గెహ్లాట్ సన్నిహితుడైన మంత్రి ప్రతాప్‌ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపైనా వేటుకు రంగం సిద్ధం చేయడంతో అంతా దారిలోకి వచ్చారు. అధిష్టానం కోరుకున్నట్లుగా సచిన్ పైలట్ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-28T03:16:50+05:30 IST