ఉచితంగా దాహార్తి తీరుస్తూ...

ABN , First Publish Date - 2022-01-20T05:35:30+05:30 IST

ఆమె 65 ఏళ్ల పెద్దావిడ. కోటంతా తిరిగి, డస్సిపోయి బయటకొచ్చే పర్యాటకుల దాహార్తిని తీర్చడమే పనిగా పెట్టుకుంది.

ఉచితంగా దాహార్తి తీరుస్తూ...

ఆమె 65 ఏళ్ల పెద్దావిడ. కోటంతా తిరిగి, డస్సిపోయి బయటకొచ్చే పర్యాటకుల దాహార్తిని తీర్చడమే పనిగా పెట్టుకుంది. గత 40 ఏళ్లుగా రాజస్థాన్‌లోని భాంగడ్‌ కోటను సందర్శించే ప్రయాణికులకు ఉచితంగా నీళ్లందిస్తున్న రమా కుమావత్‌ కథ ఇది.


రాజస్థాన్‌లోని జైపూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దెయ్యాల కోట భాంగడ్‌ ఫోర్ట్‌. ప్రధాన ద్వారాన్ని దాటుకుని, ఎగుడు దిగుడు కోట గోడలన్నీ ఎక్కి, తిరిగొచ్చేసరికి ఓపికతో పాటు, ఒంట్లో నీళ్లన్నీ ఆవిరవుతాయి. అయితే కోటంతా తిరిగి, బయటకు నడిచొచ్చేటప్పుడు గేటును ఆనుకుని, దారి పక్కనే ఓ పెద్దావిడ కనిపిస్తుంది. ఆవిడ పక్కనే మట్టి, ఇత్తడితో తయారైన బిందెలు. వాటి నిండా నీళ్లు. మర చెంబుతో నీళ్లు తీసుకుని, ‘రండి నీళ్లు తాగండి’ అని ఆప్యాయంగా పిలుస్తున్న ఆవిడ దగ్గరకు తటపటాయిస్తూ నడిచాను. చెంబు చేతికి అందిస్తుందేమో అనుకుంటే... ‘మోకాళ్ల మీద కూర్చుని, దోసిలి పట్టు’.. అంటూ లాగి కూర్చోబెట్టి, దాహార్తిని తీర్చిందా పెద్దావిడ రమా కుమావత్‌. ఆవిడను కదిలిస్తే, తన కథ ఇలా చెప్పుకొచ్చింది. 


నలుగురికీ ఉపయోగపడేలా...

‘‘కోట చుట్టి రావడం సామాన్యమైన విషయం కాదు. ఎక్కేటప్పుడు నీళ్లు మోసుకెళ్లడం కష్టం కాబట్టి, అందరూ నీళ్లు వెంటబెట్టుకు వెళ్లలేరు. అలాంటి వాళ్ల కోసమే ఈ నీళ్లు. వాళ్ల దాహార్తిని ఉచితంగా తీర్చాలనే ఈ పని ఎంచుకున్నా. రోజూ ఉదయాన్నే 9 గంటలకు నీళ్లతో ఇక్కడకు చేరుకుంటాను. ఇక్కడ దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు, చెరుకురసాలూ ఉన్నా, దాహార్తిని భేషుగ్గా తీర్చగలిగే జీవ జలం నీళ్లే కదా? పైగా ఇతరత్రా పానీయాలన్నీ డబ్బు పెట్టి కొనుక్కోవాలి. నేను అందించే నీళ్లు ఉచితం. డబ్బు కోసం నేనీ పని ఎంచుకోలేదు. కాబట్టి నీళ్లకు ప్రతిగా నా అంతట నేను ఎవర్నీ డబ్బు అడగను. ఎవరైనా ఇష్టంగా ఇస్తే మాత్రం కాదనను. మాది రైతుల కుటుంబం. భర్తను పోగొట్టుకున్నాను. ఆయన బ్రతికున్నంత కాలం పొలం పనులతో కాలం వెళ్లబుచ్చాను. తర్వాత ఆ బాధ్యత పిల్లలు తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ పెద్దబ్బాయి జబ్బుతో పోయాడు. దాంతో కోడలు, నేనూ, మనవలూ మిగిలాం. పొలం పనులు చేసే వయసు దాటి పోయింది. దాంతో ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతుకు గడిచిపోతున్నా, ఖాళీగా ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చలేదు. నలుగురికీ ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలి అనిపించింది.’’


ఊపిరి ఉన్నంత కాలం...

‘‘ఈ ఊరు కోటలకు ప్రసిద్ధి. నిత్యం ఎంతోమంది సందర్శకులు దూరాల నుంచి వచ్చి పోతూ ఉంటారు. కాబట్టి ఆ పర్యాటకుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. మునుపు ఇప్పుడు ఉన్నన్ని సౌకర్యాలు ఉండేవి కావు. నీళ్లకు విపరీతమైన ఇబ్బంది ఉండేది. నీళ్లను తెచ్చుకోని పర్యాటకులు, గ్రామంలోకి నడిచి, గ్రామస్థులను నీళ్లు అడిగి తాగుతూ ఉండడం నా కంట పడింది. నీళ్ల కోసం వాళ్లు అంత కష్టపడడం చూడలేక, నేనే నీళ్లను కోట దగ్గరకు తీసుకొచ్చాను. ఈ పనిలో నాకు నా మనవలు సహాయపడతారు. ఇలా గత 40 ఏళ్లుగా పర్యాటకుల దాహార్తిని తీరుస్తున్నా. నేను చేస్తున్న పనిలో తృప్తి ఉంది. బ్రతికినంత కాలం ఇదే పనిలో కొనసాగుతా!’’    

                                                                                                                          గోగుమళ్ల కవిత



Updated Date - 2022-01-20T05:35:30+05:30 IST