ఎన్నికలకు సై అంటున్న రజినీకాంత్.. విజయదశమి రోజున..

ABN , First Publish Date - 2020-10-13T17:40:18+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటున్నారు. విజయదశమి రోజున పార్టీ పేరు కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో

ఎన్నికలకు సై అంటున్న రజినీకాంత్.. విజయదశమి రోజున..

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటున్నారు. విజయదశమి రోజున పార్టీ పేరు కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తాను రూపొందించిన ప్రచార వీడియోలను ఆయన పరిశీలిస్తున్నారు. పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి తనకు లభించబోయే ఓటు బ్యాంక్‌పై అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రజనీతో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రముఖులు చెబుతున్న తాజా మాటలివి. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో రజనీ ముందు ప్రస్తుతం పార్టీని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. రజనీ ప్రస్తుత పరిస్థితి ‘ఇక పారిపోలేరు... దాక్కోలేరు’ అనే బిగ్‌బాస్‌ షో నినాదంలా ఉంది. 2017 డిసెంబర్‌ 31న రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి రజనీ పార్టీ పేరు ప్రకటిస్తారని కోట్లాదిమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే మిగిలివున్నా రజనీ రాజకీయ అరంగేట్రంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు, రజనీమక్కల్‌ మండ్రం నాయకులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించి రెండేళ్లు గడచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ విజయదశమి రోజున రాజకీయ ప్రవేశం, పార్టీ పేరు గురించి రజనీకాంత్‌ అధికారికంగా ప్రకటన చేయనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్‌ ఆగస్టులోగా పూర్తి చేసి ఆగస్టు 15న తిరుచ్చిలో బ్రహ్మాండమైన మహానాడు ఏర్పాటు చేసి పార్టీ పేరు ప్రకటించాలని రజనీ ముందుగా భావించారు. లాక్‌డౌన్‌ కారణంగా రజనీ అనుకున్నట్లు అటు ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ పూర్తికాలేదు. ఇటు పార్టీ మహానాడు నిర్వహించలేక పార్టీ పేరు ప్రకటించలేక పోయారు. దీంతో కొత్త పార్టీ ప్రారంభానికి సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి.


పార్టీపేరు రిజిస్ట్రేషన్‌

ఇదిలా ఉండగా రజనీ ప్రారంభించనున్న రాజీకీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్‌ చేయడానికి ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. రజనీ సన్నిహితుల బృందం వారం రోజులుగా ఢిల్లీలో బసచేసి పార్టీ రిజిస్ట్రేషన్‌ చేయడానికిగాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 2021 జనవరి నుంచి ఆయన పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే ప్రత్యేక దృష్టిసారించనున్నారు.


ప్రచారానికి 50 వీడియోలు...

అందరూ అనుకున్నట్లు కరోనా లాక్‌డౌన్‌ రోజుల్లో రజనీ ఇంటి వద్ద పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదని, పార్టీ ప్రారంభం కోసం, ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకోవడానికి తగిన సన్నాహాలు చేశారని ఆయన సన్నిహితులు తెలిపారు. గత ఏడు నెలలుగా రజనీ 50 రకాల ప్రచార వీడియోలు రూపొందించారు. తనదైన స్టైల్‌లో రాజకీయాలు, సామాజిక విషయాలు, తన పార్టీ లక్ష్యాలు, ప్రజలకు తానందించే పథకాల వివరాలు తెలియజేస్తూ ప్రసంగించిన వీడియోలను రికార్డు చేయించారు. పార్టీ పేరును ప్రకటించిన వెంటనే 50 రకాల వీడియోలను వరుసగా సోషల్‌ మీడియాలో ఆయన విడుదల చేయనున్నారని సన్నిహితులు తెలిపారు. అందులో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోల్లో పార్టీ జిల్లా శాఖ నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులకు ప్రవర్తనా నియమావళి కూడా రజనీ వివరించారు. విజయదశమి రోజున మొదటగా పార్టీ ప్రకటనకు సంబంధించి తాను మాట్లాడిన వీడియో రజనీ విడుదల చేయనున్నారు.


12 శాతం ఓటు బ్యాంకు...

గత మార్చిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించిన రజనీ తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననని, పార్టీలో యువకులకు  ప్రాధాన్యం ఇస్తానని,  పదవులు అధికంగా వుండవని, సేవచేసే వారికే ఇస్తామని ప్రకటించారు.  సీఎం పదవికి పోటీ చేయనన్న రజనీ ప్రకటన ఆయన అభిమానులకు తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. రజనీ మక్కల్‌ మండ్రాల నేతలు కూడా ఆయనతో పలు మార్లు చర్చించి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. అభిమానులు, మక్కల్‌ మండ్రాల నేతల సలహాలను విన్న రజనీ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననే నిర్ణయాన్ని మార్చుకుంటారని అందరూ భావిస్తున్నారు. ఇక ఇటీవల జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు రజనీ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 12 శాతం ఓటు బ్యాంక్‌ లభిస్తుందని తేలింది. అన్నాడీఎంకే, డీఎంకే వ్యతిరేక ఓట్లు, తటస్థమైన ఓట్లు, అభిమానులు, మక్కల్‌ మండ్రాల ద్వారా లభించే ఓట్లు  అధికంగా వున్నాయి. ఈ ఓటు బ్యాంక్‌తో రజనీ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చునని సర్వే నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి. అదనంగా మరో  20 శాతం ఓట్లను సంపాదించుకున్నప్పుడే అధికారానికి చేరువకావచ్చునని తెలిపాయి. తన ఓటు బ్యాంక్‌ పెంచుకునే దిశగా త్వరలో సంచలనాత్మకమైన ప్రజా సంక్షేమ పధకాలకు సంబంధించిన ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.


పార్టీలో చేరేందుకు లారెన్స్‌ సిద్ధం

రజనీ పార్టీ పేరును ప్రకటించగానే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌, నటుడు లారెన్స్‌ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. లారెన్స్‌తోపాటు తమిళురువి మణియన్‌, కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్‌, మాజీ మంత్రి ఏసీ షణ్ముగం, సినీ నిర్మాతలు, నటీనటులు, అన్నాడీఎంకే, డీఎంకే ల నేతలు కూడా రజనీ పార్టీలో చేరటానికి రెడీగా వున్నారు. ఇప్పటికే రజనీ మక్కల్‌ మండ్రాల నాయకుల్లో పలువురిని రజనీకాంత్‌ మార్చారు. పార్టీ పెడితే ఏయే ప్రముఖులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారనే వివరాలను రజనీ ఇప్పటికే సేకరించారు. ఆ దిశగానే పార్టీలో చేరబోతున్నవారి వద్ద రజనీ తరచూ చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో గత నెల రోజులుగా రజనీ మక్కల్‌ మండ్రాల జిల్లా శాఖల నాయకులతో చర్చలు జరిపి బూత్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ వెయ్యికి పైగా బూత్‌ కమిటీలను కూడా రజనీ ఏర్పాటు చేశారు.


పార్టీ ప్రకటన ఖాయమేనా?

రజనీ ప్రచార వీడియోలు రూపొందించడం, ఓటు బ్యాంక్‌పై సర్వేలు జరపటం, పార్టీలో వీఐపీలను చేర్చుకోవడం ఇవన్నీ సరే... ఈ విజయదశమికి ఆయన కనీసం పార్టీ పేరు ప్రకటిస్తారా? అని పార్టీ శ్రేణుల వద్ద అడిగినప్పుడు వారిచ్చిని సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాటను నేనే విననను’ అంటూ రజనీ తమిళ సినిమాల్లో వాడే పంచ్‌ డైలాగుల్లా రజనీ నిర్ణయాలు ఎప్పుడూ స్ధిరంగానే ఉంటాయని అభిమానులు చెబుతున్నారు. రజనీ రాజకీయ పార్టీని ప్రారంభించడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అభిమాన సంఘాల నాయకులు, మండ్రం నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

Updated Date - 2020-10-13T17:40:18+05:30 IST