రజనీ పార్టీలో మళ్లీ సందడి..

ABN , First Publish Date - 2020-10-24T14:54:59+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది నెలలుగా నిశ్శబ్దం రాజ్యమేలిన రజనీ మక్కల్‌ మండ్రాల్లో సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లోగా మండ్రాల్లో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలంటూ ఆ సంఘాల జిల్లా శాఖ నాయకులను రజనీకాంత్‌ ఆదేశించారు.

రజనీ పార్టీలో మళ్లీ సందడి..

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది నెలలుగా నిశ్శబ్దం రాజ్యమేలిన రజనీ మక్కల్‌ మండ్రాల్లో సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లోగా మండ్రాల్లో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలంటూ ఆ సంఘాల జిల్లా శాఖ నాయకులను రజనీకాంత్‌ ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లోని రజనీ మక్కల్‌ మండ్రాల్లో నేతలు సభ్యత్వ ఫారాలను పట్టుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇక 5 నెలలే మిగిలి ఉండటంతో రజనీ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. గత ఫిబ్రవరిలోనే తాను పార్టీ ప్రారంభిస్తానని, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయనని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించే దిశగా ప్రస్తుతమున్న మక్కల్‌ మండ్రాల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. 


రెండు నెలల్లోగా ప్రతి జిల్లాలోనూ 10లక్షలకు పైగా సభ్యులను చేర్పించాలని రజనీ నిర్ణయించారు. ఆ దిశగానే తగు చర్యలు  చేపట్టాలంటూ మండ్రం జిల్లా శాఖ నాయకులకు ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మక్కల్‌ మండ్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు బూత్‌కమిటీ సభ్యుల ఏర్పాట్లన్నీ రెండు నెలల క్రితమే పూర్తయ్యాయి. ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై ఆయన దృష్టిసారించారు. ద్రావిడ పార్టీలకు దీటుగా ఆధ్యాత్మిక రాజకీయమే ప్రధాన లక్ష్యంగా రజనీ కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఆయన ఎప్పుడు పార్టీ  ప్రారంభిస్తారా అని వేచి చూస్తున్న ఆయన అభిమానులంతా ప్రస్తుతం మండ్రాల్లో సభ్యత్వ కార్యక్రమాలు జోరుగా సాగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సభ్యత్వ కార్యక్రమాలు జరుపుతుండటంతో మక్కల్‌ మండ్రాల్లోనూ ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుందో లేదో పరిశీలించాలని జిల్లా శాఖల నాయకులను ఆదేశించారు. మండ్రం సభ్యులుగా చేరినవారికి వెంటనే ఫోటో గుర్తింపుకార్డులను కూడా ఇవ్వాలని రజనీ ఆదేశించారు. సభ్యత్వ ముమ్మర కార్యక్రమాలు పూర్తయిన వెంటనే రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-24T14:54:59+05:30 IST