Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 10:51AM

చిన్నమ్మ కొత్త రాజకీయం!

రజనీతో భేటీ తలైవర్‌ అభిమానుల మద్దతు కోసమేనా?

చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకు రాలు వీకే శశికళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో భేటీ కావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రజనీ అనారోగ్యం నుంచి కోలుకోవడం, బాబా సాహెబ్‌ ఫాల్కే అవార్డు స్వీకరించడం తదితరాల నేపథ్యంలో అతడిని అభినందించేందుకే ఈ భేటీ జరిగినట్టు శశికళ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అసలు సంగతి అది కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లనంత వరకూ శశికళదే అన్నాడీఎంకేలో హవా సాగింది. ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తగా వున్న ఒ.పన్నీర్‌సెల్వం వంటివారు తిరుగుబావుటా ఎగురవేసినా, అధికపక్షం ఆమె వెన్నంటే నిలిచింది. 


ప్రస్తుతం శశికళపై ఒంటికాలిపై లేస్తున్న మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, మాజీ మంత్రి డి.జయకుమార్‌ వంటివారు ఆమె లేనిదే పార్టీ లేదంటూ ఆకాశానికెత్తేశారు. అయితే పరిస్థితులు తారుమారై అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తరువాత.. పార్టీని నిర్వీర్యం చేసేందుకు, చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు గాను ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఈ నేతలే ప్రకటించేశారు. ఆ తరువాత ఈ ఏడాది ప్రథమార్థంలో జైలు నుంచి చెన్నై చేరుకున్న శశికళ.. ఎక్కడ అన్నాడీఎంకేను సొంతం చేసుకుంటారోనన్న బెంగ ఆ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే ఆమెకు పార్టీలో స్థానం లేదంటూ నిత్యం ప్రకటనలు చేస్తున్న అన్నాడీఎంకే నేతలు.. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. అయితే జైలు నుంచి బయటకు రాగానే అన్నాడీఎంకే నేతలంతా తన వెంట వస్తారని ఆశించిన శశికళకు ఆశాభంగమైంది. దాంతో ఆమె వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్నాడీఎంకేలోని ఒకవర్గం కార్యకర్తలతో పాటు అసంతుష్ట నేతలనూ తన దరికి చేర్చుకుంటున్నారు. అయితే తన లక్ష్యం నెరవేరేందుకు ఈ బలం సరిపోదని ఆమె గట్టిగా భావిస్తున్నారు. అందుకే రజనీ రాజకీ యాల్లోకి రావాలని భావించి, వెనుకంజవేయడంతో నిరాశతో వున్న ఆయన అభిమానుల్ని దరి చేర్చుకుంటే కొంతమేరకు తను అనుకున్న దిశగా అడు గులు వేయవచ్చని శశికళ భావిస్తున్నారు. 


దీని గురించి చర్చించేందుకే ఆమె రజనీని కలిసినట్టు ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు చెందిన ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి సోమవారం సాయంత్రమే శశికళ రజనీనికి కలిశారు. కానీ మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటించే వరకూ ఈ విషయం బయటకు పొక్కలేదు. శశికళ వద్దను కుంటే ఈ విషయం బయటకు వచ్చేది కూడా కాదు. కానీ ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ విషయం బయటపెట్టారు. ఈ వ్యవహారం అనంతరం రజనీ అభిమానుల నుంచి వచ్చే స్పందన బట్టి మున్ముందు పావులు కదప వచ్చని శశికళ భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి రజనీ దంపతులకు చాలాకాలంగా శశికళతో సాన్నిహిత్యముంది. ఇందులో భాగంగానే వారు జయ మరణించిన కొత్తలో శశికళను పరామర్శించారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక కూడా వారు కలుసుకున్నారు. కానీ ఆ విషయం బయటకు రాకున్నా.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే శశికళ ఈ సమాచారం మీడియాకు అందించారని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రజనీ అభిమానుల స్పందన తేటతెల్లమయ్యాక.. ఆమె వారిని దరి చేర్చుకునేందుకు ప్రయత్నిం చడంతో పాటు తదుపరి వ్యూహం రచిస్తారని దినకరన్‌ వర్గాలు వ్యాఖ్యాని స్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు మాత్రం శశికళ రజనీతో భేటీ కావడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏదో మతలబు లేకుండా శశికళ సూపర్‌స్టార్‌ని కలవరని వారు కలవరపడుతున్నారు. 


Advertisement
Advertisement