చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ నగరంలో ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి లత రజనీకాంత్ పరోక్షంగా సాయం చేశారని అభిమాన సంఘం నిర్వాహకుడు సంచలనాత్మక ఆడియో విడుదల చేశారు. స్థానిక తిరువాన్మియూర్ రజనీ మక్కల్ మండ్రం కార్యదర్శి భాస్కర్ మంగళవారం విడుదల చేసిన ఆడియోలో, రజనీ రాజకీయపార్టీ స్థాపిస్తారని గట్టి నమ్మకంతో ఎదురుచూశామని, అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం అభిమానులను నిరాశకు గురిచేసిందన్నారు.
నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం సమీపంలో భారీస్థాయిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి అవసరమైన వేదిక, 500 వాటర్ క్యాన్లు, మొబైల్ టాయ్‌లెట్లు తదితర సహాయాలను రజనీకాంత్ సతీమణి లత పరోక్షంగా అందించారని, ఆమె అసిస్టెంట్ సంతోష్ కూడా వీటిని పరిశీలించి వెళ్లారని భాస్కర్ తన ఆడియోలో వ్యాఖ్యానించారు. కాగా, రజనీ మక్కల్ మండ్రం ప్రకటించిన ఆందోళనకు అనుమతి జారీ చేయరాదని మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శి ఏవీకే రాజా పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానిని వాపసు తీసుకొనేలా చేసింది ఎవరనేది కూడా ఆడియో సంభాషణలో చోటుచేసుకోవడం గమనార్హం.