రజనీ నిర్ణయం

ABN , First Publish Date - 2020-12-30T05:56:27+05:30 IST

దేవుడు శాసించలేదు కానీ హెచ్చరించాడు, అరుణాచలం అలియాస్ శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ పాటిస్తున్నాడు...

రజనీ నిర్ణయం

దేవుడు శాసించలేదు కానీ హెచ్చరించాడు, అరుణాచలం అలియాస్ శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ పాటిస్తున్నాడు. గత వారం నాడు రక్తప్రసరణ ఆటుపోట్లతో హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందిన సూపర్ స్టార్, తన అస్వస్థతలో దాగిన దైవసందేశాన్ని గ్రహించారు. ఈ సంవత్సరాంతాన, గురువారం నాడు, ఆయన తన సంకల్పించిన రాజకీయపార్టీ గురించిన వివరాలు ప్రకటించవలసి ఉన్నది. దాదాపు ఇరవై అయిదు సంవత్సరాలుగా నిరీక్షణలో ఉన్న రజనీ రాజకీయప్రవేశం, ఆరంభం కాకమునుపే ముగిసిపోయిన ఘట్టం. మంగళవారం నాడు రజనీకాంత్ తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఆరోగ్యం సహకరించడం లేదని, ఒత్తిడి భరించే స్థితిలో లేనని చెప్పారు. అభిమానులను నిరుత్సాహపరుస్తున్నందుకు ఆయన బాధపడ్డారు కూడా.


ఒక అగ్రనటుడిగా తమిళుల దృష్టిలో రజనీకాంత్ ప్రతిష్ఠ ఎంతటిదో తెలియకపోతే, ఇంతకాలం ఆయన అభిమానులు ఎదురుచూడడం కానీ, ఇప్పుడు తీవ్రంగా నిరాశ చెందడం కానీ పూర్తిగా అర్థం కావు. తన నలభై సంవత్సరాల సినీజీవితంలో, మరీ ముఖ్యంగా గత మూడు దశాబ్దాల సూపర్ స్టార్ హోదాలో రజనీకాంత్ కొన్ని వేల కోట్ల రూపాయలను వినోదపరిశ్రమకు పెట్టుబడిగా, ఆదాయంగా రప్పించి ఉంటారు. యావత్ భారతీయ సినీపరిశ్రమలోనే రజనీకాంత్‌కు ఉన్నంత ఆరంభ వసూళ్లు, ఆయనపై వెచ్చించే భారీ బడ్జెట్ మరెవరికీ లేవంటే ఆశ్చర్యం లేదు. సగటు తమిళ మగ యువతరం ప్రధాన అభిమానగణంగా ఉండే రజనీకాంత్కు మహిళా అభిమానులూ అధికమే. రజనీ అంటే జనహృదయాలలో నెలకొని ఉండే ఒక జ్వరం. ఆయనను చూసి చూసి తరించడంలోనే ఆ జ్వరానికి నిదానం.


తమిళులకు భాషాభిమానం ఎక్కువే కానీ, వారికి నచ్చితే, వారి భాష మాట్లాడితే, ఎవరి మూలాలు ఏమిటని కూడా చూడరు. రజనీకాంత్ తమిళుడు కాకపోవడమే కాదు, ఉత్తరాది మహారాష్ట్రీయుడు. ఎంజిఆర్, జయలలిత వంటి వారి విషయంలో కూడా మూలాలను తమిళులు పట్టించుకోలేరు. బ్రాహ్మణేతర రాజకీయాలే చెలామణీలో ఉండే రాష్ట్రంలో జయలలితను దేవతాస్థాయిలో ఆరాధించారు. అట్లాగని కొన్ని మౌలిక అంశాల విషయంలో వారు రాజీపడరు. ద్రావిడ రాజకీయాల స్పర్శ, తమిళ సంస్కృతికి కట్టుబాటు ఉండాలి, హిందీ భాషను రుద్దితే సహించరు. తమిళరాజకీయాలలోకి రావాలనుకునే వారు ఎవరైనా ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. రజనీకాంత్ కూడా మొదట తన రాజకీయాసక్తులను జాగ్రత్తగానే నిర్వహించారు. జయలలితపై ప్రజావ్యతిరేకత గూడుకట్టుకుంటున్న సమయంలోనే, 1996  ఎన్నికలలో, డిఎంకె పక్షానికి తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికలలో జయలలిత ఘోరంగా ఓడిపోయారు. ఆ ఫలితంపై రజనీ ప్రభావం ఉన్నదని అంతా భావించారు. కానీ, ఆయన చాలా నెమ్మదిగా రాజకీయాలలోకి రావాలనుకున్నట్టు కనిపించింది. కరుణానిధి, జయలలిత ఇద్దరూ క్రియాశీలంగా ఉండడం, తన నటనావృత్తి ఎంతో ఉచ్ఛదశలో సాగుతూ ఉండడం-, బహుశా ఆయన మందగమనానికి కారణమై ఉండవచ్చు.


రజనీ రంగప్రవేశం చేస్తే ప్రభంజనమే అని ఆయన అభిమానులు అనుకున్నారేమో కానీ, తమిళరాజకీయాలను శాసిస్తున్న రెండు ప్రధానపార్టీలు పెద్దగా కలవరానికి లోనుకాలేదు. జనాకర్షణ కలిగిన హీరో విజయకాంత్ రాజకీయాలలోకి ప్రవేశించి, పెద్దగా ప్రభావం వేయలేకపోయారు. ఎంజి రామచంద్రన్ ఎన్టీయార్కు ప్రేరణ అయ్యారు. ఎన్టీయార్ తరువాత సినీ ప్రతిష్ఠను రాజకీయాలలోకి విజయవంతంగా తర్జుమా చేయగలిగినవారు లేకపోయారు. మలయాళంలో ప్రేమ్ నజీర్ ప్రయత్నం కూడా విఫలమయింది. కన్నడ హీరో రాజ్ కుమార్పై కూడా ఒత్తిడి ఉండేది కానీ, ఆయన రాజకీయాలలోకి వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నారు. ఎన్టీయార్‌తో పాటే రాజకీయాలలోకి తొంగిచూసిన తెలుగు కథానాయకుడు కృష్ణ మొదలైనవారు పరిమితమైన పాత్రనే పోషించారు. నూతన శతాబ్దంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టిన చిరంజీవి, రజనీకాంత్కు తమిళసమాజంలో ఉన్నంత జనాకర్షణ కలిగిన కథానాయకుడు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నీరస ఫలితాలను సాధించి, అంతిమంగా కాంగ్రెస్‌లో విలీనమై పోయింది. చిరంజీవి సోదరుడు, మరో ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో రాజకీయపార్టీని నిర్వహిస్తున్నారు. ఆయన సభలలో జనసందోహం సమృద్ధిగానే కనిపించినా, అవి ఓట్లుగా పరివర్తన చెందడం లేదు. కాబట్టి, సినిమా కథానాయకులు రంగప్రవేశం చేయగానే ప్రజలు బ్రహ్మరథం పడతారు అనుకోవడం భ్రమ. ఎన్టీయార్ ఘనవిజయానికి అనేక ఇతర కారణాలు కూడా దోహదం చేశాయి. మరో తమిళ హీరో విజయ్ రాజకీయ ప్రవేశం జరిగితే కూడా, ప్రభావాలు అద్భుతంగా ఉంటాయని ఎవరూ హామీ ఇవ్వలేరు.


ఎప్పుడో ఒకప్పుడు వస్తానని సినిమాలలో సూచనప్రాయంగా డైలాగులు చెప్పేవారు కానీ, రజనీకాంత్ వచ్చి తీరతారన్న నమ్మకం ఎప్పుడూ కలిగించలేదు. పదేళ్లుగా ఆయన అనారోగ్యం కూడా ఆయనలో పునరాలోచన మొదలు కావడానికి కారణమైంది. ఇద్దరు తమిళ అగ్రనేతలు వెంటవెంటనే మరణించిన తరువాత, రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉన్నదని, రజనీ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఆయన మీద ఒత్తిడి తెచ్చినట్టున్నారు. మొన్న డిసెంబర్ 3వ తేదీననే తాను రాజకీయాలలోకి వస్తున్నట్టు ఒక విస్పష్ట ప్రకటన చేశారాయన. ఇంతలోనే తిరిగి అనారోగ్యం, అంతిమ నిర్ణయం.


సినిమా ప్రేక్షకుల దృష్టిలో రజనీకాంత్ ఒక సర్వశక్తిశాలి. ప్రత్యేకమైన శైలిని ప్రకటించే నటుడు. ఆయన చూపించే అద్భుత విన్యాసాలు ప్రేక్షకులకు సంతోషం కలిగిస్తాయి. ఆయన రూపంలో, రంగులో, ఆహార్యంలో, వీరత్వ ప్రదర్శనలో ప్రేక్షకులు తమను తాము మమేకం చేసుకుంటారు. కానీ, ఆయన రాజకీయాలలోకి రావాలని విస్తృత ప్రజానీకం నిజంగా ఆశించారని చెప్పలేము. ఆధ్యాత్మిక రాజకీయాలపై ఎవరికీ పెద్దగా ఇప్పుడు ఆసక్తిలేదు. రజనీ విరమణను ముందే ఊహించిన పరిణామంగా భావించేవారు కూడా అనేకులు ఉండి ఉంటారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వస్తుంది.


ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తమను వెండితెరపై ఎప్పటిలాగానే అలరించాలని మాత్రం దక్షిణాది ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. సినిమారంగం ఆయన రహదారి.

Updated Date - 2020-12-30T05:56:27+05:30 IST