Abn logo
Feb 28 2020 @ 06:22AM

ఈ యేడూ అసౌకర్యాలే!

సీజన్‌ ప్రారంభమవుతున్నా పూర్తి కాని మామిడి మార్కెట్‌ పనులు

రూ.5.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు 

పునాదులకే పరిమితమైన 80 గదుల పండ్ల మార్కెట్‌


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల) : జగిత్యాలలోని రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మామిడి రైతులు కనీస సౌకర్యాలతో పాటు వ్యాపారుల కోసం షెడ్లు నిర్మిస్తామని ఏళ్లుగా చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఈ ఏడాది కూడా సీజన్‌ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్నా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్కెట్‌ ఆఽధునికీకరణ కోసం రూ.5.20 కోట్లు మంజూరయ్యాయి. శిలాఫలకం వేసి మూడు మాసాలు కావస్తున్నా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, పనులు పూర్తి కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.


నత్తనడకన పనులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌గల్‌ సమీపంలో ఉన్న రాజీవ్‌ గాంధీ మామిడి మార్కెట్‌ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మామిడి రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో రూ.5.20 కోట్లు మంజూరు చేసినా పనులు సాగకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జగిత్యాలలోని చల్‌గల్‌లో ఉన్న వాలంతరీ సంస్థ నుంచి 10 ఎకరాల భూమి రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌ కోసం కేటాయించారు. యేటా ఇందులోనే వ్యాపారం సాగుతోంది. జగిత్యాలలో జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతుండగా, ఇక్కడ సాగు చేస్తున్న బంగిన్‌పెల్లి రకం దేశంలోని 8 రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి నుంచి మామిడి పంటను కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. యేటా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేరకు వ్యాపారం సాగుతుంది. ఇంత పెద్ద మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేవు. రైతులు పంట తీసుకువచ్చి రోడ్లపైనే పోయాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారులు వేసుకున్న శాశ్వత షెడ్లలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. మహారాష్ట్ర, బీహార్‌ ప్రాంతాల నుంచి దాదాపు 3 వేల కూలీలు ఇక్కడికి వస్తుండగా, కనీసం వారు పడుకునేందుకు సౌకర్యాలు లేవు.


మార్కెట్‌లో మట్టి రోడ్లు ఉండటంతో అడపాదడపా కురిసే వర్షాలతో అంతా బురదమయంగా మారుతుంది. దీనికి తోడు మురికి నీరంతా మార్కెట్‌లోకే రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో జగిత్యాల బల్దియా అభివృద్ధికి మంజూరైన రూ.50 కోట్ల నుంచి మామిడి మార్కెట్‌కు రూ.3 కోట్లు, మేడ్చల్‌ మార్కెట్‌ నుంచి రూ.2.20 కోట్లు మంజూరయ్యాయి. వాటితో శాశ్వత షెడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, రైతుల కోసం విశ్రాంతి గది నిర్మించాల్సి ఉంటుంది. అలాగే తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. యేటా 60 నుంచి 70 మంది వ్యాపారులు లైసెన్స్‌ తీసుకుని కొనుగోళ్లు చేపడుతుండగా, వారి కోసం 80 గదులను కూడా నిర్మించాలని నిర్ణయించారు. కానీ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో ఈ సీజన్‌కు కూడా అందే అవకాశాలు కనిపించడం లేదు. నవంబరు 1, 2019న  మామిడి మార్కెట్‌ ఆధునీకరణ పనులను ప్రారంభించగా, మూడు మాసాలవుతున్నా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. వ్యాపారుల కోసం 80 గదులను నిర్మించే పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పట్లో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


ఈ ఏడాది కూడా అసౌకర్యాల మధ్యే..

మామిడి సీజన్‌ నెల రోజుల్లో ప్రారంభం కానుండగా, ఈ ఏడాది కూడా అసౌకర్యాల మధ్యే వ్యాపారం సాగుతోంది. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు చేపట్టాల్సి ఉండగా, కనీసం గదుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే పునాదులు తీసి, పుట్టింగ్‌ చేస్తుండగా, పనులు పూర్తి కావాలంటే రెండు, మూడు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మామిడి సీజన్‌ ప్రారంభానికి పక్షం రోజుల ముందు నుంచే లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు కొనుగోళ్ల కోసం షెడ్లు వేసుకుంటారు. మార్చి 15 నుంచే వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమవుతుండటంతో ఈ సీజన్‌లో కూడా గదులు అందే అవకాశాలు లేకుండాపోయాయి. మండు వేసవిలో మామిడి మార్కెట్‌ సాగుతుం డగా, రైతులు ఇళ్లలోనే పంట అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా రైతులకు ఎండ తీవ్రత తప్పేలా కనిపించడం లేదు. దీనికితోడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఈ ఏడాదైనా సీజన్‌ నాటికి నాలుగు షెడ్లు వేస్తారని భావించగా, ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పనులు మొదలు కాలేదు. షెడ్ల నిర్మాణ పనులు సాగుతుండగా, వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న రోడ్లు చిన్నగా పెట్టారని, ఇటీవలే వ్యాపారులు వెళ్లి జగిత్యాల ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.


దీంతో సంజయ్‌ కుమార్‌ త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది సీజన్‌ లేనప్పటికీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి దాదాపు రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సారి ఓపెన్‌ యాక్షన్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంత పెద్ద మార్కెట్‌ను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, నాయకులు పట్టించుకోకపోవడంతోనే మామిడి మార్కెట్‌ పనులు వేగవంతం కావడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.


మామిడి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...రాజేశ్వరి, వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి, జగిత్యాల

జగిత్యాల మామిడి మార్కెట్‌లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికే ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. సీజన్‌నాటికి కనీసం సగం పనులైనా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం.


కనీస సౌకర్యాలు కల్పించాలి...ఎండీ మోయిన్‌, మ్యాంగో మార్కెట్‌ అధ్యక్షుడు, జగిత్యాల

మామిడి మార్కెట్‌లో ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలి. కొద్ది రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం కాబోతున్నందున కనీస సౌకర్యాలు కల్పించాలి. షెడ్ల నిర్మాణం లేకపోవడంతో ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఏడాదైనా ఆ సమస్యలకు పరిష్కారం చూపాలి. కార్మికులకు కనీస సౌకర్యాలు లేక రోడ్లపైనే పడుకుంటున్నారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడం ఇబ్బందిగా ఉంది.

Advertisement
Advertisement