రాజ్మా గలౌటీ కబాబ్స్‌

ABN , First Publish Date - 2021-05-29T20:26:57+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ సాయంత్రం సమయంలో స్నాక్స్‌పైకి మనసు లాగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రాగి కుకీస్‌, రాజ్మా కబాబ్స్‌, బ్రొకోలి పనీర్‌ పీనట్‌ సాండ్‌ విచ్‌, రాగి చక్లీలు వంటి వాటిని తీసుకోవాలి.

రాజ్మా గలౌటీ కబాబ్స్‌

మళ్లీ మళ్లీ తినాలనిపించే స్నాక్స్‌!

లాక్‌డౌన్‌ వేళ సాయంత్రం సమయంలో స్నాక్స్‌పైకి మనసు లాగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రాగి కుకీస్‌, రాజ్మా కబాబ్స్‌, బ్రొకోలి పనీర్‌ పీనట్‌ సాండ్‌ విచ్‌, రాగి చక్లీలు వంటి వాటిని తీసుకోవాలి. ఈ స్నాక్స్‌ జీర్ణశక్తిని పెంచుతాయి. పైగా ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాయి. మరి వాటి రుచిని మీరూ ఆస్వాదించండి.


కావలసినవి: రాజ్మా - ఒక కప్పు, జీడిపప్పు - పది పలుకులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, యాలకులు - రెండు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, రోజ్‌ వాటర్‌ - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, శనగపిండి - పావుకప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా రాజ్మాను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పును గోరవెచ్చటి నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. నానబెట్టిన రాజ్మాను కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరిపోయిన తరువాత నీళ్లను వంపేసి రాజ్మాను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత వేగించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు, ధనియాలపొడి, కుంకుమపువ్వును మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును రాజ్మా మిశ్రమంలో కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరంమసాల, రోజ్‌వాటర్‌, నెయ్యి, శనగపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె రాసి వేడి చేసుకోవాలి. రాజ్మా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేత్తో కబాబ్‌లు చేస్తూ పాన్‌లో పెట్టి వేగించాలి. గోధుమరంగులోకి మారే వరకు రోస్ట్‌ చేసుకోవాలి. వాటిని గ్రీన్‌ చట్నీతో తింటే రుచి చాలా బాగుంటుంది.

Updated Date - 2021-05-29T20:26:57+05:30 IST