కొవిడ్-19: సాయుధ బలగాలకు రాజ్‌నాథ్ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-20T20:53:49+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో సాయుధ బలగాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ...

కొవిడ్-19: సాయుధ బలగాలకు రాజ్‌నాథ్ కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో సాయుధ బలగాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ పేషెంట్లకు అదనపు సౌకర్యాలు కల్పించడం సహా... ఈ మహమ్మారిపై పోరాటంలో రాష్ట్ర అధికార యంత్రాంగాలకు తగిన తోడ్పాటు అందించాలంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే‌తో రాజ్‌నాథ్ సింగ్ ఈ మేరకు మాట్లాడినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల్లోని ఆర్మీ యూనిట్లు ఆ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు అందుబాటులో ఉండాలనీ... కరోనా రోగులకు చికిత్స అందించడం సహా ఏయే అవసరాలు ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా తోడ్పాటు అందించాలని నరవణేకి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.  దీంతో ఆర్మీ ఆస్పత్రుల్లో పౌరులకు వైద్యం అందించడంతో పాటు... ప్రభుత్వాధికారులకు ఇతర విషయాల్లోనూ సాధ్యమైనంత సాయం అందించనున్నట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. 


కాగా కరోనా కల్లోలం నేపధ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై  రక్షణ మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారులతో పాటు, త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలంటూ భారత వైమానిక దళం, నేవీ చీఫ్‌లతో కూడా రాజ్‌నాథ్ మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వాధికారులతో ఎలా సహకరించగలమన్న దానిపై రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఇవాళ విడిగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు నేతృత్వంలో ఉన్న 67 ఆస్పత్రుల్లో కంటోన్మెంట్‌ నివాసులతో పాటు, బయటి వారికి కూడా వైద్య సేవలు అందించాలని సెక్రటరీ సూచించారు. డీఆర్‌డీవో సైతం దేశవ్యాప్తంగా అధికారులకు సాధ్యమైనంత సాయం అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కోవిడ్ పేషెంట్ల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలో మరోసారి చికిత్సా కేంద్రాన్ని తెరిచింది. ప్రస్తుతం 250 పడకల సామర్థ్యంతో నడుస్తున్న దీనిని 1000 పడకలకు పెంచుతోంది. 

Updated Date - 2021-04-20T20:53:49+05:30 IST