బెంగాల్‌లో బీజేపీ సిక్సర్ల మోత : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-03-17T00:06:17+05:30 IST

క్రికెట్ మైదానంలో సౌరవ్ గంగూలీ సిక్సర్లు బాదినట్లు పశ్చిమ బెంగాల్

బెంగాల్‌లో బీజేపీ సిక్సర్ల మోత : రాజ్‌నాథ్ సింగ్

వెస్ట్ మిడ్నపూర్ : క్రికెట్ మైదానంలో సౌరవ్ గంగూలీ సిక్సర్లు బాదినట్లు పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 


‘‘సౌరవ్ గంగూలీ క్రీజు దాటాడంటే కచ్చితంగా సిక్స్ కొట్టడం ఖాయం. అదేవిధంగా, లోక్‌సభలో మీ మద్దతుతో మేం క్రీజు దాటాం, శాసన సభ ఎన్నికల్లో మేం కచ్చితంగా సిక్స్ కొడతాం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో లభించిన మద్దతు శాసన సభ ఎన్నికల ద్వారా జరిగే మార్పునకు సంకేతమని తెలిపారు. 


ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందా? అని విలేకర్లు అడిగినపుడు రాజ్‌నాథ్ మాట్లాడుతూ, తమది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారని చెప్పారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల తరుణంలో గంగూలీ బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు ప్రచారమైన సంగతి తెలిసిందే. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసన సభకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2021-03-17T00:06:17+05:30 IST