టెక్నాలజీతో భారత్ సూపర్ పవర్ : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-08-27T22:25:35+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందితే భారత దేశం సూపర్ పవర్‌గా

టెక్నాలజీతో భారత్ సూపర్ పవర్ : రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందితే భారత దేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ)లో శుక్రవారం విద్యార్థులు, పరిశోధకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డీఐఏటీ అనేది రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన డీమ్డ్ యూనివర్సిటీ. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశాన్ని పరిశోధన, నవ కల్పనల రంగాల్లో ప్రగతి బాటలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నారని రాజ్‌నాథ్ చెప్పారు. సాయుధ దళాలు, పారిశ్రామిక రంగం, విద్యా రంగం కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా పరిశోధన, నవ కల్పనల్లో ప్రగతి సాధించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలను ప్రారంభించిందని తెలిపారు. పరస్పర అవగాహనతో విజ్ఞానాన్ని, ఉత్తమ ఆచరణలను పంచుకోవడం ద్వారా మాత్రమే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 


నూతన ప్రతిభను ఆకర్షించేందుకు  "iDEX" (ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్) అనే వేదికను రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. క్షేత్ర స్థాయిలో సాయుధ దళాల అనుభవాలను తెలుసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. iDEXకు కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందన్నారు. అంతేకాకుండా ఏరోస్పేస్ రంగంలో పరిశోధనల కోసం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. 


ఇటీవల తన నాగపూర్ పర్యటన గురించి మాట్లాడుతూ, రక్షణ ఉత్పత్తుల రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఓ ప్రైవేటు సంస్థ ఐదు నెలల్లో ఒక లక్ష హ్యాండ్ గ్రెనేడ్లను భారత సైన్యానికి అందజేసిందని చెప్పారు. అదే రకం హ్యాండ్ గ్రెనేడ్లను ఆ సంస్థ అధిక ధరకు ఇండోనేషియాకు అమ్మినట్లు తెలిపారు. భారత దేశంలో ఒక్కొక్క హ్యాండ్ గ్రెనేడ్ ధర రూ.3,400 కాగా, ఇండోనేషియాకు ఒక్కొక్కటి రూ.7,000 చొప్పున అమ్మినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధిస్తే భారత దేశం సూపర్ పవర్ కాగలదని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. మన దేశం సూపర్ ఎకనమిక్ పవర్‌గా మారగలదని చెప్పారు. 


Updated Date - 2021-08-27T22:25:35+05:30 IST