Abn logo
Sep 17 2021 @ 04:11AM

నా భర్తను పోలీసులే చంపారు

ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ ఉన్నతాధికారుల

నుంచి ఆదేశాలు వచ్చినట్టు చెప్తుంటే విన్నాం

6 రోజులు మమ్మల్ని సైదాబాద్‌ ఠాణాలో ఉంచారు

15వ తేదీనే మమ్మల్ని ఇంటికి పంపించారు

మా ఆయన తాగినప్పుడే నన్ను కొట్టేవాడు

మిగతా సమయాల్లో మంచిగా చూసుకునేవాడు

రాజు భార్య మౌనిక ఆవేదన

మోత్కూరు, సెప్టెంబరు 16: తన భర్తను పోలీసులే చంపారని.. చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు భార్య మౌనిక ఆరోపించారు. యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరులో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజుతో తనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయిందని.. మద్యం తాగినప్పుడు భర్త తనను కొట్టేవాడని, మిగిలిన సమయాల్లో తనను మంచిగానే చూసుకునేవాడని చెప్పారు. రాజు హైదరాబాద్‌లో తాపీ పనులకు వెళ్లేవాడని, అత్త (రాజు తల్లి ఈరమ్మ) ఇళ్లలో పనులు చేసేదని పేర్కొన్నారు.


రాఖీ పౌర్ణమికి ముందు తాను, భర్తతో కలిసి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని జలాల్‌పుర్‌లోని తన తల్లిగారింటికి వచ్చానని.. అక్కడ తనతో, తన తల్లితో గొడవ పడి ఆమెను కొట్టి హైదరాబాద్‌ వెళ్లిపోయాడని చెప్పింది. 9వ తేదీన రాజు బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన విషయం.. 10వ తేదీన పోలీసులు వచ్చి చెప్పేవరకూ తమకు తెలియదని చెప్పింది. పోలీసులు తనను, తన అన్న సురే్‌షను తీసుకెళ్లారని, ఆ తర్వాత తన తండ్రి వెంకన్నను, మరో అన్న మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. తనను, అత్త ఈరమ్మను, ఆడబిడ్డ అనితను పోలీసులు ఈ నెల 10 నుంచి 15 వరకూ సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారని వివరించింది. రాజు దొరికేంత వరకూ తమను వదిలేది లేదని హెచ్చరించారని.. ‘‘రాజు దొరక్కపోతే నీవు, మీ అత్త జైలుకెళ్లాల్సి ఉంటుంది’’ అని బెదిరించారని వాపోయింది. రాజు దొరికాడని ఒకసారి.. దొరకలేదని మరోసారి పోలీసులు తమతో చెప్పారని గుర్తుచేసుకుంది.


రాజు దొరికాడని, అతణ్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పుకోవడం తాము విన్నామని భార్య మౌనిక తెలిపింది. బుధవారం సాయంత్రం పోలీసులు తమ వివరాలు రాసుకుని రాత్రి సుమారు తొమ్మిది గంటలకు తమను ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్దకు తీసుకువచ్చి బస్సు ఎక్కించారని.. తమ వద్ద డబ్బులు లేవంటే రూ.700 పోలీసులే ఇచ్చిపంపారని చెప్పింది. తాము రాయగిరి వద్ద దిగి రాత్రి మూడు గంటలకు అడ్డగూడూరుకు చేరుకున్నామని వివరించింది. గురువారం ఉదయం తాము అన్నం తింటుండగా రాజు ఆత్మహత్య వార్త టీవీల్లో వచ్చిందని.. ఆమె విలపిస్తూ చెప్పింది. కొడకండ్లలో తమకు ఉండటానికి ఇల్లు కూడా లేదని, సింగరేణి కాలనీలో ఉన్న ఇల్లు కూల్చివేశారని.. తనకు 11 నెలల కుమార్తె ఉందని, తాము నిరాశ్రయులమయ్యామని రోదించింది. తన భర్తను చంపి న్యాయం చేసినట్టుగానే అనాథలమైన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరింది.

దహనానికీ డబ్బుల్లేవ్‌

ఒక్కగానొక్క కొడుకు ఇలా పోయాడు. వాణ్ని పోలీసులే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. నేను, నా కోడలు, మనుమరాలు అనాథలమయ్యాం. ఈ నెల 9వ తేదీన నేను ఇంటిదగ్గర లేను. ఆ రోజు నా కుమారుడు రాజు నాకు రూ.200 పంపాడు. 10వ తేదీన ఉదయం పోలీసులు ఫోన్‌చేసి.. ‘‘నీ కొడుకు బాలికపై అత్యాచారం చేసి, చంపేశాడు’’ అని చెప్పారు. రాజు ఆచూకీ గురించి అడిగితే తెలియదని చెప్పాను. నాకు భయమేసి అడ్డగూడూరులోని నా బిడ్డ ఇంటికి వెళ్తుండగా చౌళ్లరామారం స్టేజీ వద్ద పోలీసులు పట్టుకుని తీసుకెళ్లారు. ఆదివారమే దొరికాడన్నారు. మళ్లీ దొరకలేదన్నారు. బుధవారం రాత్రి మమ్మల్ని పంపించేటప్పుడు.. కోడలిని, మనుమరాలిని మంచిగా చూసుకోమని చెప్పారు. అప్పుడే మాకు అనుమానం కలిగింది. నా కొడుకు మృతదేహాన్ని దహనం చేయడానికి కూడా మా వద్ద డబ్బులు లేవు.                     


ఈరమ్మ, రాజు తల్లి


బయటికి వెళితే పోలీసులు తీసుకెళ్లారు

అడ్డగూడూరులో మా బంధువు చనిపోతే నేను, నా భర్త వెళ్లాం. పోలీసులు అక్కడకు వచ్చి అనిత ఎవరని అడిగారు. నేనని చెప్పగా నన్ను, నా భర్తను వాహనం ఎక్కమన్నారు. ‘‘రాజు మీ తమ్ముడేనా?’’ అని అడిగితే అవునన్నాను. అప్పుడు వారు రాజు ఓ బాలికను హత్య చేసినట్టు చెప్పారు. మమ్మల్ని హైదరాబాద్‌ తీసుకెళ్లి సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం దాకా ఉంచారు. అందరిని బుధవారం రాత్రి ఉప్పల్‌ రింగ్‌రోడ్డుకు తీసుకువచ్చి బస్సెక్కించారు.


రస్తాపురం అనిత, రాజు అక్క, అడ్డగూడూరు