రాజ్యసభలో గలభా చేసిన ఎంపీలపై వెంకయ్య గుర్రు...!

ABN , First Publish Date - 2020-09-21T00:53:13+05:30 IST

రాజ్యసభలో ఆదివారంనాడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెడుతుండగా జరిగిన గలభాపై ..

రాజ్యసభలో గలభా చేసిన ఎంపీలపై వెంకయ్య గుర్రు...!

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆదివారంనాడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెడుతుండగా జరిగిన గలభాపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై  తన నివాసంలో వెంకయ్యనాయుడు ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమాశంలో పాల్గొన్నారు.


దీనికి ముందు, రాజ్యసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పోడియం మైక్ లాక్కునేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోర, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ప్రయత్నించడం కనిపించింది. పలువురు ఎంపీలు డిప్యూటీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బిల్లు ప్రతులను చించేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సభాకార్యక్రమాలు 10 నిమిషాల పాటు నిలిచిపోయాయి. సభ తిరిగి ప్రారంభంకాగానే బిల్లులకు ఆమోదం లభించింది.


కాగా, ఆదివారంనాడు సభా కార్యక్రమాల్లో విపక్ష పార్టీల ఎంపీలు చేసిన గందరగోళంపై పలువురు బీజేపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను సిగ్గుమాలిన చర్యగా బీజేపీ రాజ్యసభ ఎంపీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. సభలో అనుచితంగా వ్యవహరించిన ఎంపీలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


బిల్లులపై ఆమోదం లభించగానే ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయరంగ చరిత్రలో ఇదొక వాటర్‌షెడ్ మూమెంట్ అని అభివర్ణించారు. మరోవైపు, సభాసమయం పూర్తయినందున బిల్లులపై జరిగిన చర్చకు వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని తాము ఎంత కోరినా డిప్యూటీ స్పీకర్ నిరాకరించారంటూ ఆయనపై విపక్ష పార్టీల నేతలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

Updated Date - 2020-09-21T00:53:13+05:30 IST