కోవిడ్ వారియర్ల రక్షణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN , First Publish Date - 2020-09-19T22:38:41+05:30 IST

కోవిడ్-19 వారియర్లయిన వైద్యులు, హైల్త్ కేర్ వర్కర్లపై దాడులు జరిపే వారికి, ఆస్తులు విధ్వంసం చేసే..

కోవిడ్ వారియర్ల రక్షణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: కోవిడ్-19 వారియర్లయిన వైద్యులు, హైల్త్ కేర్ వర్కర్లపై దాడులు జరిపే వారికి, ఆస్తులు విధ్వంసం చేసే వారికి ఐదేళ్ల జైలుశిక్ష విధించేందుకు రూపొందించిన బిల్లుకు రాజ్యసభ శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. అపెడమిక్ డిసీజెస్ (అమెండమెంట్) బిల్లు-2020ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పెద్దల సభలో ప్రవేశపెట్టారు. గత ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.


కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు, వేధింపులు  తగ్గుముఖం పట్టినట్టు ఈ సందర్భంగా రాజ్యసభకు హర్షవర్ధన్ తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనూ వారికి కరోనా నిబంధనలపై అవగాహన లేని వారి నుంచి వేధింపులు తగ్గాయన్నారు. కరోనా భయాల కారణంలో హెల్త్‌వర్కర్లను ఇళ్లలోకి, రెసిడెన్షియల్ సొసైటీలలోకి అనుమతించకపోవడం, కొన్ని సందర్భాల్లో వారిని తరిమికొట్టడం, ప్రాణభయంతో వారు పరుగులు తీయడం వంటి ఘటనలు ఇంతకుముందు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత హెల్త్ వర్కర్ల ఆత్మస్థైర్యం కూడా మెరుగుపడిందని ఆయన సభకు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కనిష్ట స్థాయిలో చట్టాలు, అధికారాలు ఉన్నప్పటికీ, దాడుల ఘటనలు పూర్తిగా ఆగిపోయేందుకు కేంద్ర చట్టం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్టు హర్షవర్ధన్ చెప్పారు.

Updated Date - 2020-09-19T22:38:41+05:30 IST