Abn logo
Aug 3 2020 @ 02:05AM

కరోనా రాఖీ చెబుతోంది.. భద్రం బ్రో...

కరోనా... కరోనా... కరోనా..! నిద్దట్లోనూ ఇదే కలవరింపు. దాని భయంతో చిన్నప్పుడెప్పుడో చదివి వదిలేసిన ‘పరిశుభ్రత’ పాఠం ఇప్పుడు రోజూ వల్లె వేయాల్సి వస్తోంది. విచిత్రమేమంటే... ఈ వైరస్‌ పండుగలకూ పాకింది. అలాగని ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ శ్రావణ పున్నమి వేళ సోదరులు సురక్షితంగా ఉండాలని ఈసారి ‘రాఖీ’లు సరికొత్త సందేశాన్ని మోసుకొస్తున్నాయంతే! 


రాఖీల పండగంటే అన్నాచెల్లెళ్లు... అక్కాతమ్ముళ్ల అనురాగం. ఆత్మీయ గానం. కానీ ఇప్పుడంతా ‘క్వారంటైన్‌’ జీవితం. కరోనా వెంటాడుతున్న సమయం. అందుకే రాఖీలూ రూపు మార్చుకున్నాయి. ఎక్కడ ఉన్నా... ఏం చేస్తున్నా తమ సోదరుడు సురక్షితంగా ఉండాలని కోరొకునే సోదరి మనసు తెలుసుకున్నాయి. ఒకరినొకరు కలుసుకొనే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఇలాంటి రాఖీలు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న రాఖీలు అలాంటివే.


‘‘ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో సందేశం, నినాదాలతో కూడిన రాఖీల ట్రెండ్‌ జోరుగా నడుస్తోంది. ‘స్టే సేఫ్‌ భాయ్‌’ వంటి సందేశాలున్న రాఖీల కోసం చాలామంది అడుగుతున్నారు. ఈసారి  రక్షాబంధన్‌ ప్రత్యేకమైనది. ఈ సంక్షోభ సమయంలోనూ ఓ మధుర జ్ఞాపకంగా ఉండే రాఖీలను అమ్మాయిలు ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. ఒక్కోటి రూ.150 పైనే అమ్ముతున్నాం. విచిత్రమేమంటే... కొందరు ‘న్యూటెల్లా’ థీమ్‌డ్‌ రాఖీలు అడుగుతున్నారు. బహుశా లాక్‌డౌన్‌లో దాన్ని బాగా తినుంటారు’’ అంటారు ఉత్తరప్రదేశ్‌లోని నోయుడాకు చెందిన ఆన్‌లైన్‌ స్టోర్‌ యజమానురాలు శ్రమితా గోవిన్‌. 


కరోనా వల్ల ఈ ఏడాది ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో రాఖీ పండుగకు సోదరీ సోదరులు కలవలేకపోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే, ప్రస్తుత ట్రెండ్‌ను ప్రతిబింబించేలా థీమ్‌డ్‌ రాఖీలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. ‘‘ఈ కరోనా సమయంలోనూ రాఖీ పండుగ చిరకాలం గుర్తుండిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో ‘క్వారంటైన్‌ బ్రో’, ‘స్టే ఎట్‌ హోమ్‌’ తదితర సందేశాలతో రాఖీలు రూపొందించాం. సోదరీసోదరుల అనురాగ బంధం కలకాలం వర్ధిల్లేలా మా వంతు ప్రయత్నం ఇది’’ అంటున్నారు ‘పిపా డాట్‌ బెల్లా’ ఆన్‌లైన్‌ స్టోర్‌ వ్యవస్థాపకురాలు సుచీ పాండ్యా.


ఇక వీటన్నింటితో పాటు మరో రాఖీ హాట్‌ కేక్‌లా అమ్ముడవుతోంది. మెటల్‌ స్టెతస్కోప్‌ ఉన్న రాఖీలివి. డాక్టర్లయిన తమ సోదరులకు కట్టేందుకు సోదరీమణులు వీటిని తెగ కొనేస్తున్నారు. ఈ మహమ్మారిపై పోరాటంలో ముందున్న వైద్య సిబ్బంది కోసం ఆకట్టుకొనే డిజైన్‌తో వచ్చిన ‘డాక్టర్‌ రాఖీ’లివి.


లాక్‌డౌన్‌ అనుభూతులను కూడా పంచుకొనేలా మరికొన్ని రాఖీలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ‘లూడో కింగ్‌’ మొబైల్‌ గేమ్‌కు కనెక్ట్‌ అయ్యారు. అలాంటి వారి కోసం ‘లూడో కింగ్‌’ థీమ్‌తో రాఖీలు వచ్చేశాయి. ఇవి రూ.150 నుంచి ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఇపప్పుడివి క్రేజీ రాఖీలు.


ఇవన్నీ పక్కనపెడితే... రెండు మూడు నెలలు ఇంట్లోనే ఉండటంవల్ల బయటి రుచులు మిస్సయ్యారు చాలామంది. అలాంటి వారి కోసం ఫుడ్‌ థీమ్‌డ్‌ రాఖీలు తెచ్చారు డిజైనర్‌ శిప్రా బాత్రా. సోదరుడికి ఇష్టమైన వంటకాన్ని అతడి ముంజేతికి కట్టేలా రకరకాల ఫుడ్‌ మీనియేచర్లతో రాఖీలు రూపొందించారామె. ఇలా కరోనా చుట్టూ తిరుగుతూ ఎన్నో ‘రక్షా’బంధన్‌లు ఈసారి మార్కెట్‌కు కొత్త అందాన్ని తెచ్చాయి.


ఈ కరోనా సమయంలోనూ రాఖీ పండుగ చిరకాలం గుర్తుండిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో ‘క్వారంటైన్‌ బ్రో’, ‘స్టే ఎట్‌ హోమ్‌’ తదితర సందేశాలతో రాఖీలు రూపొందించాం.


రాఖీ సందేశాలివి...

  1. స్టే సేఫ్‌ భాయ్‌ (సోదరి అభిలాష) 
  2. క్వారంటైన్‌ బ్రో 
  3. స్టే హోమ్‌.. స్టే సేఫ్‌ (దూరంగా ఉంటున్న సోదరుడికి) 
  4. గెట్‌ వెల్‌ సూన్‌ (ఐసొలేషన్‌లో ఉన్న సోదరుడికి) 
  5. హెడ్‌ఫోన్‌ భాయ్‌ (లాక్‌డౌన్‌లో హెడ్‌ఫోన్‌ వదలని సోదరుడికి) 
  6. స్టెతస్కోప్‌ (సోదరుడు హెల్త్‌కేర్‌ సర్వీస్‌ల్లో ఉంటే)

Advertisement
Advertisement
Advertisement