Abn logo
Sep 22 2020 @ 01:40AM

‘రక్తకన్నీరు’ సీత ఇక లేరు!

Kaakateeya

‘మాయాబజార్‌’లో సావిత్రితో...

‘మాయాబజార్‌’ సహా పలు చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత(87) సోమవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. 1933 అక్టోబర్‌ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో   బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్‌’  తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి సీతను ప్రోత్సహించారు కేవీ రెడ్డి. బాలనటిగానే కాకుండా హాస్య తారగా సరికొత్త మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు సీత. 1946లో ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002 లో వచ్చిన ‘నేనేరా పోలీస్‌’ చిత్రం వరకూ కొనసాగింది. 


దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ‘రుతురాగాలు’ సహా పలు టీవీ సీరియల్స్‌లో కూడా సీత నటించారు. ‘రక్తకన్నీరు’ నాటకాన్ని నటుడు నాగభూషణంతో కలసి పలు ప్రాంతాల్లో ప్రదర్శించేవారు సీత. మనసులు కలవడంతో  1956లో నాగభూషణం సీతను పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. భువనేశ్వరి, నరేందర్‌. ఓ పెద్ద నటుడికి భార్యననీ, మంచి నటిననీ అనే అహంభావం సీతలో కనిపించేది కాదని ఆమెను ఎరిగిన వారు చెప్పేమాట.  పెళ్లయ్యాక నటనకు దూరం జరిగిన సీత పిల్లలకు పెళ్లిళ్లు కావడంతో మళ్లీ నటన మీద ఆసక్తి చూపి కొన్ని సినిమాల్లో నటించారు. తనకు నటన నేర్పిన తొలి గురువు సీత అని నటి వాణిశ్రీ చెబుతుంటారు. 

Advertisement
Advertisement
Advertisement