Jun 10 2021 @ 23:43PM

మృగాల్లా ప్రవర్తిస్తున్నారు: రకుల్‌

‘‘ఓ పక్క కరోనాతో దేశవాప్తంగా ఇబ్బందులు పడుతుంటే.. కొందరు మానవత్వం లేకుండా మృగాల్లా ప్రవర్తిస్తూ, అత్యాచారాలకు పాల్పడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌.  పొద్దునే పత్రికల్లో ఓ పక్క కరోనా సంబంధిత వార్తలు, మరో పక్క రేప్‌ కేసుల గురించి చదువుతుంటే రక్తం మరిగిపోతోందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల మనేసర్‌లో జరిగిన రేప్‌ కేసు గురించి చదివాను. ఆ వార్త చదవగానే నా రక్తం మరిగిపోయింది. ఓవైపు కరోనాతో జనం చచ్చిపోతుంటే, మరోవైపు కొంతమంది ఇలా ప్రవర్తిస్తుంటే చాలా కోపం వస్తుంది. ఇలాంటి న్యూస్‌ చదువుతుంటే అసలు మనం మనుషులమేనా అనిపిస్తుంది. కరోనా కష్టకాలంలో కొందరు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. మానవత్వం లేని వాళ్లు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మనం ఏం సాధించాం అనేది మరచిపోయి ఒక సమాజంలో ఉన్నామనీ, ఇతర వ్యక్తులు కూడా మనతోనే ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది’’ అని రకుల్‌ అన్నారు.