రకుల్‌ ప్రీత్‌ సమన్లను స్వీకరించారు: ఎన్‌సీబీ

ABN , First Publish Date - 2020-09-25T07:51:07+05:30 IST

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి విచారణకై తాముకు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పంపిన సమన్లను ఆమె స్వీకరించారని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) గురువారం స్పష్టం చేసింది...

రకుల్‌ ప్రీత్‌ సమన్లను స్వీకరించారు: ఎన్‌సీబీ

  • కంగనను ఎన్‌సీబీ ఎందుకు విచారించడం లేదు?: నగ్మా
  • డ్రగ్స్‌ కేసును సీబీఐ విచారించాలి: రియా చక్రవర్తి 
  • ఎన్‌సీబీ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల బాహాబాహీ


ముంబై, సెప్టెంబరు 24: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి విచారణకై తాముకు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పంపిన సమన్లను ఆమె స్వీకరించారని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) గురువారం స్పష్టం చేసింది. అంతకు ముందు ముంబైలో కానీ, హైదరాబాద్‌లో కానీ తనకు సమన్లు రాలేదంటూ రకుల్‌ పేర్కొన్న నేపథ్యంలో ఎన్‌సీబీ తాజా ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఆమె విచారణకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇక.. కంగనను ఎన్‌సీబీ ఎందుకు విచారించలేదంటూ ఒకప్పటి నటి నగ్మా ప్రశ్నించారు. ‘‘డ్రగ్స్‌ తీసుకున్నానంటూ కంగన స్వయం గా ఒప్పుకొన్నారు. ఎన్‌సీబీ ఆమెను ఎందుకు విచారించడం లేదు? కేవలం వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా ఇతరుల్ని విచారిస్తున్నారు కదా..! అగ్ర నటీమణుల వివరాల్ని మీడియాకు వెల్లడించి, వారి పరువు తీయడం ఎన్‌సీబీ పనా..?’’ అని నగ్మా తన ట్విటర్‌ లో ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి డ్రగ్స్‌ కేసు విచారణ ఎన్‌సీ పరిధిలో లేదని రియా చక్రవర్తి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సోమవారంలోపు సమాధానం ఇవ్వాలని కోర్టు ఎన్‌సీబీకి సూచించింది.విచారణలో నటి రియా చక్రవర్తి వెల్లడి మేరకు దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖులకు ఎన్‌సీబీ సమన్లు పంపింది. దీపిక నివాసం ఎదుట పోలీసులు మొహరించారు. మరోవైపు.. డిజైనర్‌ సిమోనీ ఖంబటా, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీ గురువారం ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యారు. ముంబైలోని సంస్థ అతిథి గృహంలో ఈ విచారణ జరుగుతుండగా.. భవనం బయట జర్నలిస్టులు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. 


కంగన పిటిషన్‌పై స్పందించండి: బోంబే హైకోర్టు

నటి కంగన రనౌత్‌ భవనం కూల్చివేత కేసులో స్పందించాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు బోంబే హైకోర్టు గురువారం సూచించింది. బృహన్ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ) తన కార్యాలయ భవనాన్ని కూల్చివేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ  కంగన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కంగనను బెదిరించే తీరులో రౌత్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన డీవీడీని కంగన తరపు న్యాయవాది వీరేంద్ర సరఫ్‌ కోర్టుకు సమర్పించారు. ఆ వీడియోను పరిశీలించిన మీదట రౌత్‌ను, బీఎంసీ అధికారి భాగ్యవంత్‌ లాతేను కేసులో ప్రతివాదులుగా చేర్చేందుకు ధర్మాసనం అంగీకరించింది.  శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రౌత్‌ ఢిల్లీలో ఉండటంతో  సమయం కావాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

Updated Date - 2020-09-25T07:51:07+05:30 IST