Jun 18 2021 @ 22:47PM

తెలుగులో నా సినిమాలు తగ్గాయి! రకుల్‌

తెలుగులో తాను నటిస్తున్న సినిమాల సంఖ్య తగ్గిందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అంగీకరించారు. దీనికి కారణం హిందీ చిత్రాలే. ప్రస్తుతం హిందీలో ‘థాంక్‌ గాడ్‌’, ‘మే డే’, ‘డాక్టర్‌ జి’ చిత్రాలు చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. అంగీకరించిన చిత్రాలు కొన్నిటిని ఇంకా అధికారికంగా వెల్లడించకపోవడంతో వాటి గురించి పెదవి విప్పడం లేదు. హిందీ చిత్రాల గురించి రకుల్‌ మాట్లాడుతూ ‘‘నేను పని రాక్షసిని. రాత్రి త్వరగా నిద్రపోతా. తెల్లవారుజామున నిద్రలేస్తా. క్రమశిక్షణ, సమయపాలన ఉంటే ఎన్ని చిత్రాలైనా చేయవచ్చు. అయితే, హిందీ చిత్రాల వలన తెలుగులో నా సినిమాల సంఖ్య తగ్గింది. నేనింకా హిందీలో టిపికల్‌ నాచ్‌-గానా (కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, సాంగ్స్‌ ఉండే) సినిమా చేయలేదు. అటువంటి చిత్రం చేయాలనుంది. విభిన్న సినిమాలతో పాటు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ... బ్యాలెన్స్‌ చేయాలనుంది’’ అని చెప్పారు. వైష్ణవ్‌తేజ్‌కు జంటగా క్రిష్‌ దర్శకత్వంలో రకుల్‌ ఓ తెలుగు సినిమా చేశారు. అది విడుదల కావాల్సి ఉంది.