మనకు ఈ బ్రేక్‌ కావాలేమో!

ABN , First Publish Date - 2020-03-29T05:51:36+05:30 IST

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలు కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ తీరిక సమయాన్ని తమకు నచ్చిన పనులు చేసేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవలసిన...

మనకు ఈ బ్రేక్‌ కావాలేమో!

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలు కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ తీరిక సమయాన్ని తమకు  నచ్చిన పనులు చేసేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సోషల్‌ మీడియా వేదికగా చైతన్యం తీసుకువస్తున్నారు. టాలీవుడ్‌ సెలబ్రిటీ రకుల్‌ ‘నవ్య’ తో చెప్పిన కబుర్లు 


హాయ్‌ రకుల్‌! ఎలా ఉన్నారు?

బావున్నాను. ఇంటిలో ఖాళీగా కూర్చోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ, పరిస్థితుల వల్ల తప్పడం లేదు. నా జీవితంలో అతిపెద్ద వెకేషన్‌ ఇదే.


స్కూల్‌లో చదివినప్పుడు సమ్మర్‌ వెకేషన్స్‌ కంటే పెద్దదా?

అప్పట్లో వేసవిలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. సమ్మర్‌ క్యాంపులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు కంప్లీట్‌గా లాక్‌డౌన్‌ కదా! ఎప్పుడూ ఇన్ని రోజులు ఇంటిలో ఉన్నట్టు గుర్తు కూడా లేదు. నన్ను చూడడానికి పదిహేను రోజుల క్రితం తమ్ముడు వచ్చాడు. నాతో ఒక్క రోజు ఉందామని అనుకున్నాడు. పరిస్థితులు దారుణంగా తయ్యారయ్యాయి. ఫ్లైట్‌ జర్నీ వద్దని చెప్పా. తర్వాత లాక్‌డౌన్‌ విధించారు. తనూ నాతో పాటు ఉన్నాడు. లక్కీగా నాకు కంపెనీ దొరికింది.


లాక్‌డౌన్‌లో మీ దినచర్య ఎలా ఉంటోంది?

ఇప్పటికి రెండు వారాల నుండి నేను లాక్‌డౌన్‌లో ఉంటున్నాను. పదిరోజుల క్రితమే షూటింగులు క్యాన్సిల్‌ అయ్యాయి. అప్పట్నుంచి బయటకు వెళ్లడం మానేశా. ఖాళీగా ఉన్నానని పన్నెండింటి వరకూ నిద్రపోవడం నా వల్ల కాదు. ఉదయమే నిద్రలేచి వర్కవుట్స్‌ చేస్తున్నా. తర్వాత యోగా! నా జిమ్‌ ట్రయినర్‌ వర్చ్యవల్‌ క్లాసుల ద్వారా ఏం చేయాలో చెబుతున్నారు. నేనది చేస్తున్నా. ఇవన్నీ చేయడానికి రెండు మూడు గంటలు పడుతోంది. పూర్తయ్యేసరికి లంచ్‌ టైమ్‌ అవుతుంది. తినేసి ఏదో ఒక పుస్తకం చదువుతున్నా. సాయంత్రం తర్వాత సినిమాలు చూస్తున్నా. మధ్యలో వంట చేస్తున్నా. 


ఏం వంట చేస్తున్నారేంటి?

ఒక స్వీట్‌ ట్రై చేశా. ఒకటో తేదీన బ్రదర్‌ బర్త్‌డే కూడా! ‘నేను కేక్‌ చేయనా?’ అని అడిగా. ‘ఇప్పుడు నాకు వేరే ఆప్షన్‌ కూడా లేదు’ అన్నాడు.


ఇప్పుడు మీరు నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏంటి?

ఎక్కడో ఒక చోట ప్రపంచం పాజ్‌ కావాలి. మనుషులు తామే అత్యంత శక్తివంతులమనీ, మిగతా ప్రాణుల కంటే టాప్‌లో ఉన్నామనీ అనుకుంటారు. శుక్రవారం ఉదయం ఒరిస్సా సముద్రతీరంలో తాబేళ్లు తిరుగుతున్న ఫొటోలు చూశా. ప్రపంచంలో చాలా ప్రాణులు తమకు అలవాటైన రీతిలో తిరగడం ప్రారంభించాయి. దీనిపై మనమంతా ఆత్మశోధన చేసుకోవాలి. మనకు ఈ బ్రేక్‌ కావాలేమో! మనకు తెలియని విషయాల వెనుక పరుగులు పెడుతున్నాం. నిజమైన సంతోషం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. మనల్ని ప్రేమించే వ్యక్తులకు సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రతిదీ అశాశ్వతమని చెప్పడానికి ఇదొక రియాలిటీ చెక్‌.


కరోనాపై పోరుకు దేశమంతా ఒక్కటైంది కదా! ప్రపంచవ్యాప్తంగా మానవత్వం వెల్లివిరుస్తోంది!!

సరిహద్దులు, దేశాలు, కులమతాలకు అతీతంగా మనిషి పోరాటం చేయాలని చెప్పడానికి ఇదొక సిగ్నల్‌. వైరస్‌ ఎటాక్‌ చేసినప్పుడు నీ కులం, మతం, ప్రాంతం, సంపాదన అడగదు. నటీనటులైనా, మనుషులైనా... అందర్నీ సమానంగా చూస్తుంది. ప్రజలందరూ ఇంటిలో సేఫ్‌గా ఉంటారని ఆశిస్తున్నా.


Updated Date - 2020-03-29T05:51:36+05:30 IST