పాక్ ఆర్మీ కూల్చిన గుడికి రామ్‌నాథ్ కోవింద్

ABN , First Publish Date - 2021-12-15T23:34:42+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఢాకాలోని చారిత్రక 'రామనా కాళి' ఆలయాన్ని..

పాక్ ఆర్మీ కూల్చిన గుడికి రామ్‌నాథ్ కోవింద్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఢాకాలోని చారిత్రక 'రామనా కాళి' ఆలయాన్ని దర్శించనున్నారు. ఈ ఆలయం ఢాకాలో సాంస్కృతిక వారసత్వ సంపద, పాక్ దురాగతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. 1971 మార్చిలో ఈ ఆలయాన్ని పాకిస్థాన్ సైన్యం ధ్వంసం చేసింది. బంగ్లా విమోచన యుద్ధానికి (బంగ్లా లిబరేషన్ వార్)కళ్లెం వేసేందుకు పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో ఈస్ట్ పాకిస్థాన్‌కు చెందిన స్థానికులను పాక్ సైన్యం ఊచకోత కోసింది. ఇందులో మైనారీటీ హిందూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా గణనీయంగా ఉన్నారు. 2017లో అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢాకా వెళ్లినప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి భారతదేశం సహకరిస్తుందని ప్రకటించారు.


మెఘల్ పాలకుల కాలం నాటి చారిత్రక ఆలయంగా 'రామనా కాళి' ఆలయాన్ని చెబుతారు. ఆలయ విధ్వంసానికి ముందు ఢాకాలోని కీలక మత, సాంస్కృతిక వారసత్వ సంపదగా ఈ ఆలయం నిలిచింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 మార్చి 7న చేసిన ప్రసంగం అప్పట్లో ఉర్రూతలూగించింది. అప్పటి ఫోటోలు చూసినప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఆలయం కొట్చొచ్చినట్టు కనిపిస్తుంది. కాగా, బంగ్లాదేశ్ 50వ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా రామ్‌నాథ్ కోవింద్ ఢాకా వెళ్లారు. ఈనెల 15వ తేదీ నుంచి 17 వరకూ అక్కడే ఉంటారు. భారత త్రివిధ దళాలకు చెందిన 122 మంది సభ్యుల కంటింజెంట్‌ కూడా బంగ్లా సెలబ్రేషన్స్ పరేడ్‌లో పాల్గొంటోంది.

Updated Date - 2021-12-15T23:34:42+05:30 IST